18, సెప్టెంబర్ 2013, బుధవారం

paata taram heerolu..పాత తరం చిత్ర సీమ కథా నాయకులు

1940-1950 మధ్య తెలుగు సినిమా హీరోల్లో నాగయ్య, సీ.హెచ్.నారాయణరావు సినిమాలు, అలాగే సీ.యస్.ఆర్., ఈలపాట రఘురామయ్య సినిమాలు కొద్దిమందికైనా గుర్తు ఉండవచ్చును. లేక  ఈమధ్య టీ.వీ.లో వేసినప్పుడు చూసివుంటారు.

కాని ఉమామహేశ్వరరావు గురించి ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు. ఆయన కాంచనమాల,లక్ష్మీరాజ్యం తో కలిసి 'ఇల్లాలు', లక్ష్మీరాజ్యం తో కలిసి 'పంతులమ్మ' లో నటించారు. కడప లో ఉన్నప్పుడు ఆయనను చూసాను. వృత్తి రీత్యా లాయరు. మంచి స్ఫురద్రూపి. తెల్లగా, కొంచెం లావుగా వుండేవాడు.

గిరి అని మరొక హీరో రెండు సినిమాల్లోనే  వేసినట్టు గుర్తు. బందా కనకలింగేశ్వరరావు ప్రధానంగా నాటకాల్లో వేస్తూ ప్రసిద్ధి పొందినా కాంచనమాలతో కలిసి 'బాలనాగమ్మ' సినిమాలో వేసారు. ఆ రోజుల్లో స్టేజి నటులు అప్పుడప్పుడు సినిమాల్లో వేసినా నాటకరంగానికే ప్రాధాన్య మిచ్చేవారు.