30, సెప్టెంబర్ 2013, సోమవారం

kalavantulu


 
 


  ఒకప్పుడు బోగంవారని,తర్వాత కళావంతులని పేరున్నవారి కులవృత్తి గురించి ఇక్కడవ్రాయడంలేదు.వారిలో చాలామంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు.ఈ రోజుల్లో అనేక కారణాలవలన ఇతర కులాలలోకి కూడా ఈ పడుపు వృత్తి  వ్యాపించింది.నేను వ్రాయదలుచుకొన్నది;వారు సంప్రదాయకళలకి,ఆధునిక కళలకీ.చేసిన సేవ ,contribution గురించి మాత్రమే.రాజసభల్లో నర్తకులుగా,దేవాలయాల్లో దేవదాసీ నర్తకులుగా నృత్యకళను బాగా నేర్చుకొని ప్రదర్శించేవారు.మేజువాణీల్లోను,కొన్ని పెళ్ళిళ్ళలోను కూడా నాట్య ప్రదర్శనలిచ్చేవారు.శాస్త్రం తెలిసిన పండితులు వీరికి నేర్పేవారు.ఒక్క మన రాష్ట్రం లోనేకాదు ,ఒడిస్సా,తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే సంప్రదాయసంగీతం,నృత్యం ,పోషించారు.ఉత్తరాదిలో కూడా,నవాబులు,మహారాజాల ప్రాపకంలో హిందూస్తానీ సంగీతాన్ని,నృత్యాల్ని అభ్యసించి ప్రదర్శించేవారు.వీరిలో కొందరు కవయిత్రులూ,విదుషీ మణులూ కూడా ఉండేవారు,వీరిలో ధనవంతులైనవారు కొందరు గుళ్ళు తటాకాల నిర్మాణానికి ,గోపురాలకి,సత్రాలకి దానధర్మాలు చేసిన శాసనాలు ఉన్నాయి.
  ఇక ఆధునిక కాలంలో చూస్తే,మొదట్లో సంసారస్త్రీలు ముందుకురాని  రోజుల్లో నాటకాలు, సినిమాలలో,ప్రధానపాత్రలు ధరించి జనరంజకంగా ప్రసిద్ధి పొందిన వారు.జానపదకళాకారులవలె మన కళల్ని ఆచరించి,వృద్ధి పొందించడంలో  వీరి ముఖ్య పాత్రకు అభినందనలు, కృతజ్ఞతను తెలుపవలసి వున్నది. 

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

naa amerika yatra =contd.-Independence Day


4--7--13:- 4th  of  July , American Independence Day: ఇవేళ అమెరికా స్వాతంత్ర్య దినం. హడ్సన్ (Hudson) నదిలో నౌకలని నిలబెట్టి వాటినుంచి బాణాసంచా కాలుస్తారు. సాయంకాలం నుంచి ట్రాఫిక్ నిబంధన, పోలీసు పహరా ప్రారంభమైనది. కొందరు కార్లలో ఇతర ప్రాంతాలనుంచి వచ్చి వీక్షించారు. కొందరు పడవలు, క్రూయిజ్ల (cruise) నుంచి వీక్షించారు. మేము మాత్రం మా ఇంట్లోనుంచే చూడగలిగాము. రాత్రి9-30 నుంచి 10 గంటలదాకా ఆ కార్యక్రమం కొనసాగింది. ఎంతో గొప్పగా, మనోజ్ఞంగా సాగింది. నవరత్నాలు రాశులుగా ఆకాశం లోంచి రాలుతున్నట్లు అనిపించింది. జాతీయ కార్యక్రమం కాబట్టి ప్రభుత్వశాఖ నిర్వహిస్తుంది అనుకొన్నాము. కాని, అమెరికా కదా, దీన్ని కూడా ఒక ప్రైవేటు కంపెనీ కి అప్పజెప్పారు. మొత్తం మీద జులై నాలుగు ఉల్లాసంగా గడిచింది.
(ఇంకావుంది)

18, సెప్టెంబర్ 2013, బుధవారం

paata taram heerolu..పాత తరం చిత్ర సీమ కథా నాయకులు

1940-1950 మధ్య తెలుగు సినిమా హీరోల్లో నాగయ్య, సీ.హెచ్.నారాయణరావు సినిమాలు, అలాగే సీ.యస్.ఆర్., ఈలపాట రఘురామయ్య సినిమాలు కొద్దిమందికైనా గుర్తు ఉండవచ్చును. లేక  ఈమధ్య టీ.వీ.లో వేసినప్పుడు చూసివుంటారు.

కాని ఉమామహేశ్వరరావు గురించి ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు. ఆయన కాంచనమాల,లక్ష్మీరాజ్యం తో కలిసి 'ఇల్లాలు', లక్ష్మీరాజ్యం తో కలిసి 'పంతులమ్మ' లో నటించారు. కడప లో ఉన్నప్పుడు ఆయనను చూసాను. వృత్తి రీత్యా లాయరు. మంచి స్ఫురద్రూపి. తెల్లగా, కొంచెం లావుగా వుండేవాడు.

గిరి అని మరొక హీరో రెండు సినిమాల్లోనే  వేసినట్టు గుర్తు. బందా కనకలింగేశ్వరరావు ప్రధానంగా నాటకాల్లో వేస్తూ ప్రసిద్ధి పొందినా కాంచనమాలతో కలిసి 'బాలనాగమ్మ' సినిమాలో వేసారు. ఆ రోజుల్లో స్టేజి నటులు అప్పుడప్పుడు సినిమాల్లో వేసినా నాటకరంగానికే ప్రాధాన్య మిచ్చేవారు.       

16, సెప్టెంబర్ 2013, సోమవారం

naa amerikaa yaatra--11: తిరుగు ప్రయాణం


ఆగస్టు 4 న మా వాళ్ళతో కలసి విమానంలో న్యూయార్కు లో బయలుదేరి 5వ తేదీన క్షేమంగా హైద్రాబాదు చేరుకున్నాము. తిరుగు ప్రయాణం సాఫీగా జరిగిపోయింది.

అమెరికా గురించి నా భావనలు (impressions): ఒక దేశం గురించి బాగా  తెలుసుకోవాలంటే ఆ దేశంలో ఒక ఏడాదిపాటు ఉండి, ప్రజలతో పరిచయం చేసుకొని, దేశమంతా తిరిగి అధ్యయనం  చేస్తేనే నిజ పరిస్థితి కొంతైనా తెలుస్తుంది. నేను చూసింది తూర్పుతీరంలో ఈశాన్యభాగమే. ఇది బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. చాలా పెద్దదైన అమెరికాలో లోపల, ఎడారులు, వర్షాభావప్రాంతాలు కూడా ఉన్నవి. ఐనా నేను చూసి తెలుసుకొన్నంత వరకు మాత్రం వ్రాస్తున్నాను.

1. అమెరికా అప్పుల్లో ఉంది, ఆర్థికసంక్షోభంలో  ఉంది అంటారు కాని స్థూలదృష్టికి మనకు అంతా బాగనే ఉన్నట్లు అనిపిస్తుంది.

2. అమెరికాలో జీవన వ్యయం బాగా ఎక్కువ; ఐతే ఆదాయాలు కూడా బాగా ఎక్కువే. పేదరికం లేకపోలేదు కాని, బాగా తక్కువే. భారత్ కన్నా బాగా వైశాల్యంలో పెద్ద దేశం. జనాభా  తక్కువ. మంచి నీరు,విద్యుత్, రోడ్ల వంటి ప్రాథమిక అవసరాలు అందరికి అందుబాటులో ఉన్నాయి.

3. ఇక్కడ infrastructure బాగుంది. ఐతే పెరిగిన జనాభా, అవసరాలకి తగినట్లు  ఇంకా అభివృద్ది చేద్దామంటే డబ్బుచాలదు. కొన్ని నగర పాలక సంస్థలు దివాలాతీసాయి.

4. కార్లకిచ్చిన ప్రాముఖ్యం బస్సులకీ, రైళ్ళకీ లేదు. చాలా చోట్ల బస్సులు దొరకవు. రైళ్ళు నెమ్మదిగా నడుస్తాయి. జపాన్ లోలాగ వేగంగా నడవవు. రైలు చార్జీలు కూడా బాగా ఎక్కువ. public transport కి ప్రాముఖ్యత లేదు.

5. హైస్కూలు విద్య వరకూ అందరికీ ఉచితం, నిర్బంధమూ. ఉన్నత విద్య మాత్రం చాలా ఖరీదు. అందువలన చాలా మంది పై చదువులు చదవ లేకపోతున్నారు.పై చదువులు చదవాలంటే పెద్ద మొత్తంలో అప్పు చేయాలి. ఇక్కడ జబ్బుచేస్తే  చాలా కష్టమే. వైద్య  ఖర్చులు చాలా ఎక్కువ. అందరికీ ఇన్షూరెన్సు లేదు. అందుకే అద్యక్షుడు ఒబామ తగిన చర్యలు  తీసుకుంటున్నారు.

6. వ్యక్తి స్వేచ్చకు ప్రాముఖ్యమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు.

7. సింగిల్ పేరెంట్ కుటుంబాలు 30  శాతం ఉన్నాయి. దీనికి కారణం విడాకులు, లేక అసలు పెళ్ళి లేకుండా ఉండటం.

8.high technology, యుద్ధ సామగ్రి (armaments) ఉత్పత్తి  ఎక్కువ.  కాని వినిమయ వస్తువుల ఉత్పత్తి బాగా తక్కువ. ఎలక్ట్రానిక్ ప్రాడక్ట్స్, గృహోపకరణాలు, అన్నీ ఇతరదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు. బజార్లలో made in U.S.A.అని ఏ వస్తువు మీదా ముద్ర కనబడదు. రోడ్ల మీద జపాన్ వారి   హోండా, టొయోటా, నిస్సాన్ కార్లే ఎక్కువ కనబడ్తాయి. అమెరికన్ కార్లైన  Ford , General  Motors, Chrylser మరీ ఎక్కువగా కనబడ లేదు.

9. సామాన్య ప్రజలకి పొదుపు తక్కువ. విలాసాలకి బాగా ఖర్చు పెడతారు. పిలలు పెద్దవగానే విడిపోయి వేరే జీవిస్తూఉంటారు.

10. ప్రభుత్వ ఉద్యోగాలు బాగా తక్కువ. ప్రైమరీ టీచర్లు, అగ్ని మాపక దళం, పోలీసుల వంటివి కొన్ని తప్ప, ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూనో , లేక స్వతంత్రం గానో బతుకుతుంటారు. ఐతే నిరుద్యోగులు, వృద్ధులు మొదలైనవరికి, సోషల్ సెక్యూరిటీ కింద ప్రభుత్వం కొంత భరణం చెల్లిస్తుంది.

చివరిమాట. ఒకమనిషిని 10,20, సంవత్సరాలు రోజూ చూస్తుంటే మనకు పెద్ద మార్పు కనబడదు. అదే మరొకరు చాలాకాలం దూరంగా ఉండి చూస్తే చాలా మార్పు కనిపిస్తుంది. స్వతంత్రం వచ్చి60 ఏళ్ళైనా దేశం అలాగే ఉందని మనవాళ్ళు రాస్తూఉంటారు. కాని,నా అమెరికా మిత్రుడు సత్యం గారు మన దేశం, ప్రజలు, అన్నిరంగాల్లో  చాలా అభివృద్ధి  చెందిందని, బాగా మారిపోయిందని అంటారు. 2050 నాటికి ఇంకా చాలా అభివృద్ధి చెంది ప్రపంచంలో ఒక అగ్రరాజ్యమౌతుందని ఆయన అభిప్రాయం. అదే నిజం కావాలని మనమంతా  ఆశిద్దాము.
         
(అమెరికా యాత్ర సమాప్తం)    

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

naa america yaatra --10: Metropolitan Museum
 ఇంతకు ముందే రాయవలసిందిమరచిపోయి ఇప్పుడు రాస్తున్నాను. ఈ రోజు మెట్రోపాలిటన్ ముసెఉం (మెట్రోపాలిటన్  మ్యూజియం) కి బయలుదేరాము. న్యూయర్కులో ఎన్నో మ్యూజియంస్ ఉన్నాయి. ఒక్కొక్క  విషయానికి ఒక మ్యూజియం వేర్వేరు గా ఉన్నాయి. ప్రాణికోటికి Natural history museum, చిత్రకళకి Guggeinheim
 museum, ఇలా వేరువేరు గా ఉన్నాయి.

ఈ Metropolitan Museum కళాత్మక వస్తువులు వివిధ దేశాలనుంచి సేకరించి ఉన్నవి. ఇది 5వ అవెన్యూలోఉంది. రోజుకి కొన్ని వేలమంది సందర్శిస్తుంటారు. అసలు బిల్డింగే ఎంతో ఉన్నతంగా గొప్పగా ఆకర్షణీయంగాఉంది. ముఖద్వారం గ్రీకో రోమన్ శైలిలో పెద్దస్తంభాలతో ఉంది. లోపల పెద్దహాలు రినజాన్సు renaissance శైలిలో ఉంది. ప్రాచీన ఈజిప్టు, సుమేరియా, సింధు నాగరకత నుంచి, మధ్యయుగాలు దాటి ,ఆధునిక అమెరికన్ నాగరకత వరకు కళాత్మక వస్తువులు, శిల్పాలు, చిత్రాలు  ఎన్నో ఉన్నవి. ఒక్కొక్క విభాగానికి దాని దాత పేరు పెట్టారు. ఈ మ్యూజియం మన సాలార్జంగ్ మ్యూజియం కి రెండురెట్లు పైగా ఉంటుంది. మూడు అంతస్తులలో వందలకొద్ది గదులలో  ప్రదర్శించిన పద్ధతి  బాగుంది. మధ్యలో అల్పాహారం తీసుకొని ఉదయం 11 గంటల్నుంచి, సాయంత్రం 5 గంటల వరకు తిరిగి చూసాము.నాకు చక్రాల బండి ఏర్పాటు చేసారు. ప్రతీది వివరంగా చూస్తూ పోతే కొన్ని  రోజులు పట్టుతుందంటారు.

మనకన్నా ఇక్కడి ప్రజలకి ఇటువంటి ప్రదర్శనలంటే ఎక్కువ ఆసక్తి. శ్రద్ధ చూపిస్తారు. ఇందులో నేను చూసిన విగ్రహాలన్నిటిలోను  ఆకర్షించినవి, చాలా పెద్దవి, ఒక్కొక్కటి 20 అడుగుల కన్నా ఎత్తయినవి మూడు:
1.ఈజిప్టు రాజు ఫరో రాంసెస్ విగ్రహం.
2.'మెడుసా ' తల ఖండించి చెతితో పట్టుకున్న గ్రీకువీరుడు 'పెర్సియస్ ' విగ్రహం
3.పాండ్య దేశపు శిల్పము, విష్ణుమూర్తి విగ్రహము.

ఇంతకు ముందు చూడని అస్సీరియన్, ఫొనీషియన్, సైప్రస్, పెర్షియన్ శిల్పాలు ఉన్నాయి. మరొక ముఖ్యమైనవిషయం, ప్రాచీన ఈజిప్టు  దేవాలయం ఒకదాన్ని తీసుకువచ్చి ఇక్కడ మళ్ళీ కట్టారు.'హాట్సెప్సట్ ' రాణి ' స్ఫిన్క్ ' విగ్రహం కూడా ఉన్నది. మొత్తం మీద విజ్ఞానాని, వినోదాన్ని పంచిపెట్టే యీ మ్యూజియం ని చూడటం ఒక గొప్ప అనుభవం.  

12, సెప్టెంబర్ 2013, గురువారం

naa amerikaa yaatra;-9: Lincoln Center


లింకన్ సెంటర్ లో 6 పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఇది మాన్ హాటన్ లో ప్రధాన కళావేదిక అనవచ్చును. రోజూ వీటిలో ఏవో ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. మధ్యలో ఒక జలయంత్రం (water fountain) వెలుగులు చిమ్ముతూ ఉంది.

థియేటర్లు, ఒపెరాహాల్స్, కాన్సర్ట్ హాల్స్, ఫలహారశాలలు, పెద్ద్ షాపులు ఉన్నవి. అందులో ఏవరీ  ఫిషర్ హాల్ (Avery fisher hall ) కి టికెట్లు తీసుకొని వెళ్ళాము. అందులో  బీథోవెన్,మొజార్టు సంగీత కచేరీ జరుగుతున్నది. సరిగా 7-30 కి ప్రారంభమై 9 గం. కి ముగిసింది. మోజార్ట్ 40 బీథోవెన్7  వ సింఫనీ, వాయించారు. 40 మంది వాద్యకారులు, వయొలిన్స్, సెల్లోలు, ఫ్లూట్స్, సాగ్జోఫోన్స్, డ్రంస్ తో బృందం బాగా ప్రదర్శన  ఇచ్చారు. కండక్టర్ బాగా ప్రసిద్ధుడైన  'లూయీ లాంగ్రి. '
మన కచేరీలకి పాశ్చాత్యుల వాటికీ  కొన్ని తేడాలున్నాయి.
1.ప్రకటించిన సమయానికి సరిగ్గా మొదలుపెడతారు.
2.కచేరీ జరిగినంతసేపు నిశ్శబ్దంగా ఉండాలి.
3.ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వారు రావడం, పోవడం కుదరదు. ఒక ప్రదర్శన ముగిసిన తర్వాతే శ్రోతలు చప్పట్లతో వారి అభినందనలు  తెలియజెయ్యాలి కాని మధ్య మధ్యలో చెయ్యకూడదు.
4. సన్మానాలు, దీర్ఘప్రసంగాలు, వీ.ఐ.పీ.ల కోసం వేచి ఉండటం ఉండదు.
సరిగా వీళ్ళ లాగే మనం చెయ్యాలి అనను; మన పద్ధతులు సంప్రదాయాలు మన కుంటాయి కాని సమయపాలన, నిశ్శబ్దం పాటించాలని  నా అభిప్రాయం.
శాస్త్రీయ సంగీతమైనా హాలు నిండిపోయింది. 2 వేలమంది వచ్చిఉంటారు. వేదిక చుట్టూ ఉన్న గాలరీలే కాక, పెద్ద, చిన్న బాల్కనీలన్నీ నిండిపోయాయి. మన ఆంధ్రదేశంలో శాస్త్రీయ కళలకి లభించే ఆదరణ గూర్చి తలచుకొంటే బాధ కలుగుతుంది.


11, సెప్టెంబర్ 2013, బుధవారం

naa amerikaa yaatra---8 (contd): నేస్తం

27-7-2013 నేస్తం:

ఈ రోజు అంతా బిజీగా గడచింది. నా బాల్యమిత్రుడు గొర్తి సత్యం (G.V.Satyanaaraayana moorti) న్యూయార్కు స్టేట్ లోనే కటోనా అనేప్రాంతంలో ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళడానికి మేము మధ్యాహ్నం 1-30 కి బయలుదేరి, గ్రాండ్  సెంట్రల్  స్టేషన్ నుంచి రైలు లో వెళ్ళాము. స్టేషన్ నిజంగానే 'గ్రాండ్ ' గా ఉంది. గంటంపావు ప్రయాణం తర్వాత కటోనా స్టేషన్ లో దిగాము. అక్కడనుంచి సత్యం మమ్మల్ని కారులో తీసుకొని వెళ్ళాడు. మా యీడు  వారైనా వారిద్దరూ కారు డ్రైవ్ చేస్తారు. అక్కడ తప్పదని చెప్పాడు. దారిలో అంతా పచ్చని చెట్లు, వనాలు, సరస్సులతో మనోహరంగా ఉంది.మా సత్యం వృత్తి రీత్యా అడ్వొకేట్. ఆయన సతీమణి ఇందిర మెడికల్ డాక్టర్. ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. పిల్లలు నలుగురు బాగా పైకి వచ్చి వేరే చోట్ల ఉంటున్నారు. ఇక్కడ అది మామూలే.

వాళ్ళ ఇల్లు పై గోడలతో సహా అంతా కలప (wood) తో కట్టినదే. కింద 2 హాల్సు, మేడమీద 2 పడక గదులు ఉన్నవి. వంటగది వేరే ఉంది. రెందు ఎకరాలస్థలంలో ఒకపక్క చిన్నచెరువు లేక కుంట (pond) ఉంది. అందులో చాల లిల్లీ పువ్వులు వికసించి ఉన్నాయి. చుట్టూ చెట్లు, పూలమొక్కలు, అంతా ఒక ఋష్యాశ్రమం లాగ ఉన్నది. మా సత్యంకి నాలాగే పుస్తక పఠనం అంటే ఆసక్తి. సెల్లార్ లో పెద్ద లైబ్రరీ ఉంది. డాక్టర్ ఇందిరకి ప్రపంచ యాత్రలంటే ఇష్టం. (wander lust) ఐదు ఖండాల్లోను అనేక యత్రాస్థలాలు దర్శించింది.

వాళ్ళ ఇంట్లో కొంతసమయం గడిపాక మళ్ళీ బయలుదేరి సాయంత్రం 5-30 కి న్యూయార్కు మాన్ హాటన్ చేరుకున్నాము. సాయంత్రం 7-30 గంటలకి లింకన్ సెంటర్లో (concert) కి వెళ్ళాము. దానికి ముందే టికెట్లు రిజర్వు చేసుకున్నాము.

naa amerikaa yaatra--contd: Haggers Town-NY


తర్వాత ఇంటికి వచ్చి, భోజనం చేసి  హేగర్స్ టౌన్ నుంచి వాషింగ్టన్ బయలుదేరాము. ఒక పక్క అపలేషియన్ కొండలు, అడవులు, పచ్చని బయళ్ళు వారి ఇంటి పరిసరాలు ఎంత అందం గా ఉన్నవో చెప్పలేను. దారిలో fairfax వెళ్ళి, మా అబ్బాయి మిత్రుడు, విజయకుమార్ ఇంటికి వెళ్ళాము. కారులో GPS సహాయంతో అడ్రెస్ కనుక్కొన్నాము. వాళ్ళ ఇలు చాలా పెద్దది చాలా బాగుంది. కాని అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాము. మా అబ్బాయిని తీసుకొని మళ్ళీ బయలుదేరాము. విజయకుమార్ దంపతులిద్దరూ I.T.ప్రొఫెషనల్స్. మమ్మల్ని వాషింగ్టన్ బస్ స్టేషన్ దగ్గర వదలి డాక్టర్ దంపతులు  వెళ్ళిపోయారు. మేము 5 గంటలు ప్రయాణం చేసి న్యూయార్కు చేరుకున్నాము. దారి అంతటా నదులు, పచ్చదనం తో ఆహ్లాదంగాఉంది.


Naa America Yaatra: Haggers Town


 హేగర్స్ టౌన్ కి వెళ్ళేముందు, దారిలో Dr.లక్ష్మి ఆనంద్ ల కూతురు స్నిగ్ధ చదువుకుంటున్న మేరీలాండ్ (Maryland) విశ్వవిద్యాలయం కు వెళ్ళి అమ్మాయి హాస్టల్ రూం లో కొంతసేపు గడిపాము. మేరీలాంద్ యూనివర్సిటీ చాలా పెద్దదే. అన్ని ఇటుకలతొ కట్టబడిన పెద్దా కట్టడాలే. చాలా ఫేకల్టీలు ఉన్నాయి. మధ్య మధ్యలో పార్కులు, చెట్లు, అవెన్యూలతో అందంగా ఉంది. స్నిగ్ధ  అండర్ గ్రాడ్యుఏషన్ చేస్తున్నది. neuro biology, Hospital administration చేస్తున్నది. గ్రాడ్యుయేషన్, post-Graduation తర్వాత చెస్తుందట. ఇక్కడ పిల్లలు 18 సం; నిండక ముందే స్వతంత్రంగా బతకాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంచేత పార్ట్ టైం ఏదో ఒక పని చేస్తుంటారు. ధనవంతులైనా నామోషీ పడరు. ఇదిగాక కొంతకాలం పియానో నేర్చుకుంది. ఇప్పుడు నృత్యం నేర్చుకుంటున్నది. తన సహచరులతో కలిసి చేసిన fusion నృత్యం విడియో చూపించింది. చాలా ప్రతిభ, పట్టుదల ఉన్న అమ్మాయి.
మొత్తం మీద నాకంపించింది; ఇక్కడి యువజనం స్వతంత్ర భావాలు కలిగి ఉంటారని, కొత్తవి నేర్చుకోవాలనే తపన కలిగి ఉంటారని. కొందరు మాత్రం స్కూలు వదిలేక చదువు మానివేసి ఏదో పనులు చేసుకుంటూ బదుకుతారు. కొందరు డ్రగ్స్ అలవాటు చేసుకుంటారు.

తర్వాత హేగర్స్ టౌన్ చేరుకున్నాము. ఊరికి శివార్లలో 2 ఎకరాల స్తలం లో వాళ్ళైల్లు వుంది. బాగా పెద్దదే. సెల్లరు (cellar), గ్రౌండ్ ఫ్లోరు, పై అంతస్తు ఉన్నాయి. భార్యాభర్తలకి చెరొక కారు ఉన్నాయి. కింది అంతస్తులో డ్రాయింగ్ రూం, భోజనశాల, వంటగది ఉన్నాయి. పై అంతస్తులో పడక గదులు ఉన్నాయి. సెల్లారులో హోం టీ.వీ.ఉంది. మొత్తం 12 గదులు ఉన్నాయి. ఆరాత్రి అక్కద గడిపాక  మర్నాడు Dr,ఆనంద్ తాను 4 గురు సహచరులతో కలిసి ప్రాక్టీసు నడుపుతున్న హాస్పిటల్కి తీసుకు వెళ్ళాడు. వాళ్ళందరూ పిల్లల స్పెషలిస్టులే. ఎవరి ప్రాక్టీసు  వాళ్ళకుంది. వీరుకాక ఇద్దరు నర్స్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. ఆ చుట్టుపకల వీళ్ళదే  ముఖ్యమైన పిల్లల హాస్పటల్  అని తెలిసింది.

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

naa amerikaa yaatra;==7: Philly-DC

18,19,20 జులై,2013;--
19వ తా; మధ్యాహ్నం బస్సులో బయలుదేరి రెండు గంటలు ప్రయాణం చేసి 'ఫిలడెల్ఫియా 'చేరుకున్నాము. ఎప్పటిలానే మా పెద్దబ్బాయి నాకు తోడు. ఆవూళ్ళో మా చిన్నన్న కూతురు, మనమడు, అతని భార్య ఉన్నారు. ఇద్దరూ ఉద్యోగాలు  చేస్తున్నారు. బస్ స్టేషన్ కి వచ్చి లోకల్ ట్రైన్ లో మమ్మల్ని వాళ్ళింటికి తీసుకొని వెళ్లాడు. ఆ ఇల్లు గేటెడ్ కమ్మ్యూనిటీలోఉంది. కొంచెం చిన్నదైనా అన్ని సదుపాయాలు కలిగి ఉంది.ఉదయం 9 గంటలకి మా మనమడు వాసు కారులో అందరం వాషింగ్టన్ బయలుదేరాము. ఫిలడెల్ఫియా కూడ పెద్ద పట్టణమే.అక్కడికి గంటప్రయాణం.మా అమ్మాయి తెలుగు భోజనం తెచ్చింది కాబట్టి లంచ్ కి ఇబ్బంది లేకపోయింది.

న్యూయార్క్ అమెరికాకి ఆర్థిక,వ్యాపారకేంద్రం కాగా ,వాషింగ్టన్ పరిపాలనాకేంద్రం.రాజధాని.న్యూయార్క్ తో పోలిస్తే చిన్న నగరం. కాని,న్యూఢిల్లీ లాగే అందంగా, హుందాగా ఉంది, మీదు మిక్కిలి విశాలంగా. ఊరినిండా విగ్రహాలు, పార్కులు, మ్యూజియంస్, monument s ఉన్నాయి. మేము లింకన్ మెమోరియల్, జెఫ్రెసన్ మెమోరియల్, వాషింగ్టన్ మెమోరియల్ చూసాము. వాషింగ్టన్ మెమోరియల్ దగ్గర ఒక పెద్ద స్తంభం (column/ obelisk) ఉంది. ఊరంతా కనిపిస్తుంది. Smithsonian institutes అని చాలా ప్రదర్శన శాలలు ఉన్నాయి. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ smithsonian  institutes  ల లోకి ప్రవేశం ఉచితం. కాని సమయాభావంచేత లోపలికి వెళ్ళి చూడలేదు.

తర్వాత తిన్నగా శ్వేత సౌధం అనగా వైట్ హౌస్ (white house) కి వెళ్ళాము. పూర్తిగా తెల్లగా రంగులేవీ లేకుండా ఉండటంచేత దీనిని వైట్ హౌస్ అంటారు. ఇదే అమెరికా అధ్యక్షుడి నివాస  స్థానము, మరియూ ఆఫీసు. అంటే ప్రపంచంలోకెల్లా ధనవంతమూ, శక్తివంతమూ అయిన దేశానికి పరిపాలకుని నివాసం. జాతీయ,అంతర్జాతీయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే చోటు. ఇది మూడంతస్తులలో ఉంది. ప్రవేశ ద్వారం గ్రీకు స్తంభాలతో నిర్మించారు. చుట్టూ ఇనప కటకటాలు, గేట్లతో ఉంది. ప్రత్యేక అనుమతి లేనిదే లోనకు వెళ్ళలేము. పైనుంచే చూసాము. కాని ఇంతకు ముందు ప్రత్యేక అనుమతి సంపాదించి చూసామని మా పెద్ద కోడలు విజయ చెప్పింది. చాలా బాగుంటుంది, చూడవలసినవి  చాలా ఉన్నాయని చెప్పింది. బ్లూరూం, రెడ్ రూం,  గ్రీన్ రూం అని డెకర్ బట్టి  పేర్లు పెట్టారు. ఒక చైనా రూం కూడా ఉందట. అందులో అరుదైన పింగాణీ వస్తువులు ఉంటాయి. అతిథులను ఆహ్వానించె గది,    సమావేశపు గదులు, భోజనశాలలు, విదేశీప్రతినిధులతో సమావేశమయ్యే గది ఇలా ఉన్నాయట. అధ్యక్షుల కుటుంబం నివసించే భాగానికి మాత్రం ప్రవేశం నిషిద్ధం. ఏమైనా మన రాష్ట్ర పతి భవనం కన్నా బాగా చిన్నది. బకింగ్ హాం ప్యాలెస్ (Buckingham  Palace) కన్న, రష్యా లోని క్రెంలిన్ (Kremlin) కన్నా చిన్నదే.

తర్వాత ముఖ్యంగా చూడవలసిన కేపిటల్ హిల్ (capitol hill) కి వెళ్ళాము. ఇందులోనే అమెరికా శాసనసభల సమావేశాలు జరుగుతాయి.(U.S.congress and senate) అనేక సినిమాల్లో  పెద్దగుమ్మటం లాగ కనిపించేది ఇదే. మేము ముందే అనుమతి తీసుకొని సెక్యూరిటీ చెక్ తర్వాత లోపలికి వెళ్ళాము. విశాలమైన హాల్స్ దాటి డోం లోకి ప్రవెశించాము. ప్రపంచంలోని అతిపెద్ద డోంస్ (domes) లొ ఇదొకటి అని చెప్పవచ్చును. గోడలు,స్తంభాలు, పైకప్పు మీద అమెరికన్ చరిత్రను,300 సం; సంఘటనలను, ప్రముఖ వ్యక్తులను చిత్రించే శిల్పాలు, చిత్రాలు (paintings) ఉన్నాయి. దీనికి ఆనుకొని కొన్ని సమావేశపు హాల్స్ ఉన్నవి. కింద, ఇంత పెద్ద గుమ్మటాన్ని నిలబెట్టే మూలస్తంభాల గది ఉంది. లింకన్, రీగన్, రెడ్ ఇండియన్ చీఫ్  విగ్రహాలు చూడదగినవి. మొత్తం మీద వాషింగ్ టన్ నగరాన్ని డామినేట్  చేసే యీ భవనాన్ని చూడకుండా రాకూడదు.

ఊరి నిండా ఆఫీసులు, మ్యూజియములు, గ్రంథాలయాలు, 18,19, శతాబ్దపు శైలి కట్టడాలు చాలా ఉన్నాయి. కాని న్యూయార్కులో వలె పెద్ద ఆకాశ హర్మ్యాలు లేవు. న్యూయార్క్ నగరం కన్నా  విశాలంగా, సుందరంగా వుంది. ఐనా దేని ప్రత్యేకత దానిదే కదా.

కేపిటల్ హిల్ చూసి బయటకు వచ్చాక మా వాసు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మాచిన్నకోడలు  చెల్లెలు, డాక్టర్ లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ ఆనంద్ నన్ను  వాళ్ళవూరు హేగర్స్ టౌన్ (Haaggers Town) తీసుకు వెళ్ళారు. మా అబ్బాయిని అతని స్నేహితుడు వాళ్ళవూరు 'ఫెయిర్ఫాక్స్ (Fairfax) తీసుకొని వెళ్ళాడు. (ఇంకా ఉంది).