29, మార్చి 2012, గురువారం

China-7-contd.


 

  మింగ్ వంశం 1368 నుంచి 1644 వరకు దాదాపు మూడు శతాబ్దాలు చైనా సామ్రాజ్యాన్ని పరిపాలించింది.ఇందులో కొందరు రాజులు అసమర్థులైనా,మధ్యలో కొన్ని అపజయాలు పొందినా రాజ్యాంగయంత్రం పటిష్టం గా ఉండటం వలన పరిపాలన బాగానే సాగింది.మొత్తం 16 చక్రవర్తులు పరిపాలించారు .మంగోలియా,కొరియా,జపాన్లపై దండయాత్రలు విఫలమైనవి.అన్నాం (నేటి వియత్నాం ) ని ఆక్రమించినా తీవ్రమైన తిరుగుబాట్ల వల్ల నిలబెట్టుకోలేక ఉపసమ్హరించు కోవలసి వచ్చింది.కాని,మిగతా సామ్రాజ్యమంతా శాంతి భద్రతలు నెలకొన్నాయి.కళలు,చేతి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.నవలలు రచించ బడ్డాయి.అందులో ఒకటి - పూర్వం హుయెన్ త్సాంగ్ భారత దేశ యాత్ర అనేక కల్పనలతో రచింప బడినది.విదేశాలతో వర్తకం ,దేశంలో పంటలు ,వాణిజ్యం అభివృద్ధి చెందాయి.40 ప్రధాన నగరాలు ఉన్నట్లు యూరపియన్ యాత్రికులు రాసారు.అంతకుముందు నుంచే వున్నా ఈ కాలంలో, పింగాణీపరిశ్రమ (porcelain),సిల్కు వస్త్రాలు, కాగితం,ముద్రణ,ఇంకా అభివృద్ధి చెందాయి. సిల్కు బట్టలపై చిత్రలేఖనం చైనా వారి ప్రత్యేకత.
  ఈ కాలంలో జరిగిన మరొక ముఖ్యమైన విషయం - 6సార్లు పెద్ద నౌకాదళం ఆగ్నేయ ఆసియాదేశాలు, శ్రీలంక,మనదేశంలో మలబార్ తీరం ,పెర్షియన్ సింధుశాఖ ,ఆఫ్రికా తూర్పు తీరాలను చుట్టిరావడం.కాని సముద్రాంతర వలసరాజ్యాలు మాత్రం స్థాపించలేదు.(ఒక శతాబ్దం తర్వాత యూరపియన్ దేశాలు ఆ పని చేశాయి ) ఇంత గొప్ప నౌకలని అంతవరకు ఏ దేశమూ తయారు చేయలేదట .కాని ఆ తర్వాత ఎందుకో చైనా నౌకాదళాన్ని నిర్లక్ష్యం చేసింది.
 మరొక ముఖ్య విషయం చైనా మహాకుడ్యాన్ని (great wall of China) పటిష్టంగా పునర్ నిర్మించడం.ఇప్పుడు యాత్రికులు బీజింగ్ దగ్గర చూసేది మింగ్ వంశం నాడు కట్టినదే అంటారు.
  ఈ కాలంలో చైనా జనాభా 3 రెట్లు పెరిగిందని అంచనా.అంతవరకు 2వేల సం; నుంచి 5-10 కోట్ల మధ్య ఉండే జనాభా దాదాపు 30 కోట్లకు పెరిగింది.మింగ్ రాజధాని మధ్య చైనా లోని నాంజింగ్ నుండి ఉత్తర చైనా లోని బీజింగ్ కు మార్చబడింది.అక్కడే అనేక రాజభవనాలు ,రోడ్లు ,ఉద్యానవనాలు ,సరస్సులు ,ఆలయాలు నిర్మించారు.వాటినే ఇప్పుడు పర్యాటకులు దర్శిస్తూవుంటారు.
 సాంస్కృతికంగా పెద్ద మార్పులేమె లేవు.కంఫుసియస్ నీతిశాస్త్ర పద్ధతుల్లోనే సమాజం ప్రవర్తిల్లుతుండేది.స్త్రీలు శీల వతులై ,భర్తలకు అనుకూలంగా విధేయులై ఇల్లు చక్క బెడుతూ ఉండాలి.సేవకులు  యజమానుల ఆజ్ఞలను పాటించాలి.ప్రజలు రాజభక్తితో ఉండాలి.వ్యక్తి జీవితంలో నిజాయితీ, సత్యసంధత తో గౌరవమర్యాదలు పాటించాలి.
 బౌద్ధమతాన్నికూడా ప్రజలు అనుసరించే వారు.బౌద్ధ ఆరామాలు చాల ఉండేవి.సన్యాసులు,శ్రమణకులు (monks) బొధలు చేస్తూ,తిరుగుతూ ఉండేవారు. గురుశిష్య సంబంధాలు మనలాగే ఉండేవి.
     (  మిగతా మరొకసారి.)                  

28, మార్చి 2012, బుధవారం

our armed forces
 ఈ రోజు పత్రికల్లో జనరల్ వీ,కే.సింగ్ స్టేట్మెంట్ చదివి రాస్తున్నాను.ప్రభుత్వాన్నిగాని,ఏ పార్టీని గాని సమర్థించాలని కాదు.నా సందేహాలను తెలియజేయడానికే.
  1.ఇన్నాళ్ళు వూరుకొని తనకు పదవీ కాలం పొడిగింపు ఇవ్వకపోయేసరికి అక్కసుతో ఇలా మాట్లాడినట్లు  ఉంది.
  2.మంత్రులు,రాజకీయనాయకులు అంతా అవినీతిపరులు,అసమర్థులూ అనుకొందాము.మరి సైనికాధికారులు ఏం చేస్తున్నారు?
  3.సైన్యాధ్యక్షుడు గా ఉన్న అతనికి ప్రమేయమేమీ లేదా?మన సైన్యాన్ని అన్ని విధాలా బలోపేతం చెయ్యడానికి ,మంచి,అధునాతన ఆయుధాలు సేకరించడానికి ఆయన బాధ్యత లేదా?
  4.సైన్యానికి తగిన ఆయుధాలను తయారు చేసుకోడానికి ,కొనడానికి ,చాలా కాలం పట్టుతుంది.దానికి చాలా procedures కమిటీలు తతంగం ఉంటుంది.అందువలన సింగు గారి ప్రకటన నిజమైతే ఆయన తో బాటు కనీసం గత 10 ఏళ్ళ నుంచి సంబంధిత కమిటీలు,
 మంత్రులు,సైనికాధికారులు ,అందరూ బాధ్యత ఎంతొకొంత వహించవలసి ఉంటుంది.
 5.అంతిమ నిర్ణయం కేబినెట్దే ఐనా సాంకేతిక సమాచారం ,సిఫార్సులు సైనిక నిపుణులు అందించవలసి ఉంటుంది.కేబినెట్ నిర్ణయాలు  దానిపైనే ఆధారపడిఉంటాయి.
 6.గతంలో బోఫోర్స్ ఫిరంగులు పనికిరానివి కొన్నారని విమర్శించారు.కాని కార్గిల్ యుద్ధంలో అవి తమ సామర్థ్యం నిరూపించుకొన్నాయి.అలాగే మన చిన్న నాట్ (GNAT) విమానాలు అంతకు ముందు యుద్ధంలో పెద్దవిమానాలపై పైచేయి సాధించాయి.
 7.ఏమైనా వీ,కే .సింగు గారు ఈ సైనిక బలహీనతలను సరిచేసి ,పటిష్టం చేయడానికి తన హయాంలో ఏ చర్యలు తీసుకొన్నారో  తెలియజేస్తే మంచిది.
 8.సైనిక రహస్యాలను వెల్లడించడం మంచిదికాదు.దీనిపై  ప్రతిపక్షాలలోని నిపుణులతోబాటు కమిటీ వేసి తగు చర్యలు తీసుకొంటే మంచిది.
 9.ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోడంకంటే ,సైనిక పాటవాన్ని ఎలా బలపర్చుకొని దేశాన్ని శత్రుదుర్భేద్యం చెయాలనన్న విషయం  పై దృష్టి కేంద్రీకరించాలి.
   ఈ విషయంపై నాకన్నా మిలిటరీ వ్యవహారాలు తెలిసిన వారు ,నిపుణులు,స్పందించి వ్రాస్తే బాగుంటుంది.

China-6-contd.
  మనమిప్పుడు 11 వ శతాబ్ది వరకు చైనా చరిత్రను విహంగావలోకనం చేసాము.టాంగ్ వంశీయుల ఉచ్చదశ,క్షీణదశ తర్వాత చైనా 6,7,రాజ్యాలుగా విడిపోయింది.టాంగుట్,జుర్చెన్,మంగోల్,తార్తార్ ,టిబెటన్ మొ '" చైనీయేతర జాతులవారు చాలా భాగాలను ఆక్రమించుకొన్నారు. చైనా రాజులు యాంగ్- సికి- యాంగ్ నదీ ప్రాంతాన్ని ,దక్షిణ చైనా ప్రాంతాన్ని నిలబెట్టుకొన్నారు.ఈ వంశం పేరు సోంగ్ లేక సాంగ్ వంశం.(song dynasty  ) వీరు ఏ.డి. 1000 నుంచి 1250 వరకు పాలించారు.
  అప్పుడు ప్రపంచాన్నే గడగడ లాడించిన మంగోల్ దండ యాత్రలు చెంగిజ్ ఖాన్ నాయకత్వంలో ప్రారంభమయ్యాయి. ఆసియా, యూరప్ ఖండాల్లో విశాలమైన ప్రాంతాలు ,రాజ్యాలు జయించి చెహెంఘిజ్ఖాన్ ,అతని వారసులు,మధ్యధరా సముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రంవరకు సామ్రాజ్యాన్ని విస్తరింప జేసారు.చెంగిజ్ మనుమడు కుబ్లైఖాన్ చైనా అంతటినీ వశపర్చుకొన్నాడు.తన వంశానికి 'యువాన్ ' వంశమని పేరుపెట్టుకొన్నాడు. మంగోలులు సంచారజాతులు కాబట్టి వారి జీవన విధానం వేరుగా ఉండేది. కాని ,కుబ్లైఖాన్ చైనా(హాన్ జాతి) వారి విధానాలను,కంఫూసియస్ సిద్ధాంతాలను అనుసరించి పరిపాలించేడు.ఇతని కాలంలోనే మార్కో పోలో అనే ఇటలీ దేశస్తుడు వచ్చి రాజదర్బారులో కొంతకాలం ఉన్నాడు.అతని వ్రాతలవలన ,అప్పటి చైనా దేశపు నగరాలు, సంపదలు, భవనాలు,వైభవం గురించి యూరప్ కి తెలిసింది.ఆకాలంలో యూరప్ ఇంకా పేదరికంలో, అనాగరకంగా వెనుకబడిఉండేది.అందువలన మార్కోపోలో రాసినవి అతిశయోక్తులో,కల్పనలో అని కొందరు అనుకొన్నారట.
   కుబ్లైఖాన్ చైనాను ఆక్రమించిన తర్వాత ,కొరియా, జపాన్, వీత్నాంలను ఆక్రమించడానికి పెద్ద నౌకా దళాన్ని తయారుచేసి పంపించాడు.కాని రెండుసార్లు పెద్ద తుఫాన్లు (టైఫూన్) వచ్చి ఆ ప్రయత్నాలు విఫలమైనవి.
  మంగోలువంశపు పాలన వంద 100 సంవత్సరాలు సాగినతర్వాత తిరుగుబాట్లు చెలరేగాయి. ఝూ (zhu) అనే వీరుడు నాయకత్వంవహించి క్రమంగా మంగోలుల పాలనను అంతంచేసి మళ్ళీ స్వదేశీ చైనా  వారి పాలనను ప్రారంభించాడు.చైనా చక్రవర్తిగా ప్రకటించుకొన్నాక (A.D.1375) తన వంశానికి 'మింగ్ ' (MING) అనే పేరు పెట్టుకొన్నాడు.మింగ్ అంటే ప్రకాశవంతమైన అని అర్థం.ఈ మింగ్ వంశం చైనా చరిత్రలో ప్రసిద్ధి గాంచినది. (మిగతా మరొక సారి. )
   

18, మార్చి 2012, ఆదివారం

New Year Greetings to all


 

 నందన నామవత్సర   మమంద మనోజ్ఞ మహానుభూతులన్
 అందరు బంధు మిత్రులకు నందగజెయుత మంచు గోరుచున్
 అందములొల్కెడి జీవన మరందము గ్రోలుడి యంచు దెల్పెదన్
 డెందము పుల్కరింపగ ,స్వదేశ విదేశ ప్రజాళి కంతకున్ .

          ----------------------  
  నవయుగాదికి నాందిగా నందనాఖ్య
  వత్సరాంగన అరుదెంచె ,పల్లవసుమ
  శోభిత దుకూలమును దాల్చి శుభములీయ
  నెల్లవారికి ,స్వాగత మ్మీయ రండు.      
          ------------------

14, మార్చి 2012, బుధవారం

China-5-(contd.)
 ఈ టాంగ్ వంశ పాలనా కాలంలోనే చైనా సామ్రాజ్యం మధ ఏసియాలో సమర్ఖండ్ వరకు ఉత్తరాన మంచూరియా వరకు విస్తరించింది.ఆ కాలంలో (7,8,శతాబ్దులలో  )ప్రపంచంలోనే పెద్ద ,గొప్ప,సామ్రాజ్యంగా వెలసింది.చివరిలో  ఆన్ లుషాన్ అనే సైనికాధికారి తిరుగుబాటు చేసి రాజధాని చాంగాన్ ను ఆక్రమించి ,చక్రవర్తిని తరిమేసాడు.అతని మరణం తర్వాత మళ్ళీ రాజధాని టాంగ్ వంశస్తుల వశమైంది కాని,పూర్వ ప్రాభవం పొందలేక పోయింది.
  A.D.750 నుండి 907 వరకు వరుసగా 15 గురు చక్రవర్తులు పాలించినా ,తిరుగుబాట్లు ,సరిహద్దుల్లో ఆక్రమణలూ ఎక్కువైనవి.10వ శతాబ్దంలో 3రాజ్యాలుగా చీలిపోయింది.ఇందులో ఉత్తరప్రాంతాన్ని పాలించిన వారు చైనా హాన్ జాతీయులు కాదు.ఖిటాన్ అనే జాతి వారు .వారి భాష కూడా వేరు.
  6-10 శతాబ్దుల కాలంలో చైనాలో పరిస్థితులు.
  రాజకీయ పరిస్థితులు ఎలా మారుతున్నా దేశంలో జనజీవితం యధావిధిగా కొనసాగుతూ ఉంటుంది కదా. సిల్క్ బట్టల తయారీ. ఎగుమతులూ కొనసాగుతూ ఉండేది.వెదురు నుంచి కాగితం తయారీ అప్పటికే జరుగుతూ ఉందేది .A.D.8 వ శతాబ్దంలో పేపరు మీద అచ్చులతో ముద్రించడం (block  printing) ప్రారంభ మైనది.యూరప్లో గుటెన్ బర్గ్ ముద్రణా యంత్రాన్ని 15వ శతాబ్దంలో కనిపెట్టేవరకు వాళ్ళకు ప్రింటింగు తెలియదు.మనదేశంలో 18 వ శతాబ్దంలోనే మిషనరీలు అచ్చువేయడం   ప్రారంభించారు.చైనాలో అప్పటి నుంచే బౌద్ధ ,కంఫూసియన్ ,గ్రంధాలు ముద్రించడం ప్రారంభించారు.మన కావ్యాల్లో చీనిచీనాంబరాల ప్రసక్తి క్రీ.పూ.నుండే కనిపిస్తుంది.చైనాలో నదులు,కాలవల ద్వారా,రోడ్ల ద్వారా రాకపోకలు, సరకుల రవాణా,జరుగుతూ ఉండేవి. నౌకల ద్వారా సముద్ర వ్యాపారం జరుగుతూ ఉండేది.(మన దేశం,ఆగ్నేయాసియా దేశాలతో ఎక్కువగా సముద్రమార్గంలోను ,మధ్య ఆసియా,పెర్షియా ,టర్కీ ,యూరప్లతో భూమార్గంలో సిల్కు రోడ్డు పైన వాణిజ్యం జరిగేది.
  ఫ్యూడల్ పద్ధతిలో ,కంఫూషస్ సిద్ధాంతాలప్రకారం జరిగేది.శిక్షలు కఠినం గాఉండేవి.పెద్దలను చిన్నవారు ,యజమానులను సేవకులు,రాజులను ఉద్యోగులు ,ప్రజలు గౌరవించాలి ,ఆజ్ఞలను శిరసావహించాలి.
 ఆ కాలంలో పెద్ద నగరాలు లుయాంగ్ ,చాంగాన్,నాంజింగ్ ,యాంగ్జౌ, గువాంగ్జౌ, చెంగ్డు బీజింగ్,,కొంతకాలం లుయాంగ్, కొంతకాలం చాంగాన్ రాజధానులుగా ఉండేవి.ఉత్తరప్రాంతంలో గోధుమలు,జొన్నలు ,దక్షిణప్రాంతంలో వరి ఎక్కువగా పండించేవారు.పెద్ద పెద్ద కట్టడాలు  కూడా ఇటుకలు,మట్టి,పెంకులు, చెక్క కర్రల తోనే నిర్మించే వారు.
  ఇంతవరకు,10వ శతాబ్ధి   A.D.వరకు చాలా క్లుప్తంగా చైనా చరిత్ర తెలుసుకొన్నాము.ఇంకా ఉంది.to be continued  

 
  

13, మార్చి 2012, మంగళవారం

China-contd.
 చైనా -A.D.189 TO 550.
 హాన్ సామ్రాజ్యం అంతరించిన తర్వాత ,దాదాపు 400 సంవత్సరాలు చైనా మూడు రాజ్యాలుగా చీలిపోయింది.సరిహద్దు ప్రాంతాలన్నీ ఇతర జాతులవారు ఆక్రమించుకొన్నారు.మూడు రాజ్యాలలో ఉత్తర వెయ్ (wey) ,పశ్చిమ ప్రంతం షు,(shu) ,తూర్పు(wu) వు,అనిపేర్లు. వరుసగా వాటిని 5,16,9, వంశాలు పాలించాయి.ఈ కాలంలో కంఫుసీన్ ,దావొలా ఎ,బౌద్ధ మతాలు వర్ధిల్లాయి.వీటిని అనుసరించే వారి మధ్య చర్చలు,వాదప్రతివాదాలు జరిగేవి.ఒక్కొక్క సారి ఒకరి పద్ధతులను,సిద్ధాంతాలను,మరొకరు అనుసరించేవారు.కాని మతప్రాతిపదిక పైన యుద్ధాలు జరిగేవి కావు.చైనా చరిత్ర లో కూడా చాలా యుద్ధాలు ,రక్తపాతాలు,అంతహ్కలహాలు,జనహత్యలు జరిగాయి. కాని అవి మతం కోసం కాదు.రాజ్యం కోసం ,అధికారం, ప్రాబల్యం కోసం ,పగలు ద్వేషాల వలన జరిగాయి.
  సామ్రాజ్యం విచ్చిన్నమైనా ,వర్తకవ్యాపారాలు,కళలు,నాగరకత కొనసాగాయి.అనేక బౌద్ధ ఆలయాలు నిర్మించబడినవి.కాని అవి మన దేశంలో లాగ గుండ్రని స్తూపాల వలె కాక,చైనా పద్ధతిలో 3,4,అంతస్తులతో చతురస్రం గా నిర్మింపబడినవి.ఈ కాలంలో చైనా(హాన్) జాతివారే గాక హూణులు (Huns ) సియాలు (Xias) మొదలైన ఇతర జాతులవారు కూడా కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకొని  పాలించారు.
   ఆ.డ్.550--755-ఈ కాలంలోనే మళ్ళీ చైనాని  ఒకే ఆధిపత్యం కిందికి తీసుకువచ్చే ప్రయత్నం జరిగింది.ఇందులో మొదటి కొంతకాలం సుయి (suyi) అనే రాజవంశం ,తర్వాత టాంగ్ (tang) అనే వంశం పాలించాయి.ఈ కాలంలోనే హుయన్సాంగ్ (xuanzang) అనే బౌద్ధ భిక్షువు మన దేశానికి వచ్చి బొద్ధమతాన్ని ,గ్రంథాలను అధ్యయనం   చేశాడు. అప్పుడు మనదేశంలో హర్షవర్ధనుడు పాలించేవాడు.ఈ యాత్రికుని చాలా ఆదరించాడు.హుయన్సాంగ్ A.D, 629లో చైనా వదలి చాలా కష్టం మీద భూమార్గంలో మనదేశం వచ్చి,దేశమంతా తిరిగి A,D.645 లో సముద్ర మార్గంలో తిరిగి వెళ్ళాడు. అనేక గ్రంథాలను  తీసుకొని వెళ్ళాడు.   -to be continued later
 

  

3, మార్చి 2012, శనివారం

office phones


 
  మీకెప్పుడైనా మీ సెల్ ఫొన్ నేలమీద విసిరిపారేయాలనిపించిందా?ప్రతివారికీ ఎప్పుడో ఒకసారైనా అనిపించిఉంటుందని నా నమ్మకం.
 ఈ మధ్య ఒక ఆఫీసులో పనిబడి వాళ్ళ నంబర్ కోసం ప్రయత్నించాను.కొన్ని ఆఫీసులూ ,బేంకులూ వాళ్ళ నంబర్లు ప్రచురించరు .ఒకాయన దానికి కారణం చెప్పాడు.ఎవళ్ళు పడితే వాళ్ళు అస్తమానం ఫోన్లు చేసి విసిగిస్తారట .నాకు కావలసిన ఆఫీసు నంబర్లు
ఎలాగో సంపాదించి ఫోన్ చేసాను.అందులో రెండు నంబర్లకి మీ నంబర్ సరిచూసుకొండి అని జవాబు వచ్చింది.మరి రెండునంబర్లకి రింగు వినబడుతున్నా ఎవరూ ఎత్తలేదు. అలా మూడు సార్లు  జరిగింది.ఆ రోజు సెలవు రోజు కాదు.ఫోన్ చేసిన సమయం కూడా ఆఫీసు టైమే.ఉదయం 11గంటలు.పోనీ బిజీగా వున్నారేమో నని మళ్ళీ 2గం/కి ఫోన్ చెసాను  మూడుసార్లు.రింగవుతున్నా ఈ సారీ  ఎవరూ పలకలేదు.సాయంత్రం 4గం/ కిమళ్ళీ ఫోన్ చేస్తే దయతలచి ఒక అమ్మాయి పలికింది .ఫలానా ఆఫీసరుతో మాట్లాడాలంటే ఇంకో నంబరుకి కనెక్ట్ చేసింది.ఈ సారి ఒక అశరీరవాణి ఈ ఆఫీసరు కావాలంటే ఈ నంబరులేక  ఈఆఫీసరుకైతే ఈనంబరు,ఆసెక్షన్ కైతే ఆనంబరు నొక్కమని,చివరగా నోరు మూసుకోవాలంటే ఈనంబరు నొక్కమని చెప్పింది.అశరీరవాణితో సంభాషణ కుదరదు కదా .నాకు కావలసిన నంబరు  గుర్తుపెట్టుకొని నొక్కాను,ఈసారి ఒక మొగ గొంతుక నాకు కావలసిన ఆఫీసరు ఈ నంబరు కాదని ఆయన వేరే డిపార్ట్మెంట్ అని మరోనంబర్ ఇచ్చాడు.ఆ నంబర్ నొక్కితే ఒక పాట వినిపించింది.పాట పూర్తయేదాకా విన్నాక ఆగిపోవడమే కాక కనెక్షన్ తెగిపోయింది.అరగంటపోయాక మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ ఇదే తంతు రిపీట్ అయింది.దానితో కోపమూ,దుహ్ఖమూ రాగా ,సెల్ ఫోన్ ని నేల మీదికి విసిరికొట్టాలని ,మనకే నష్టం కదా అని ఊరుకొన్నాను.
 తర్వాత ఒకసారి అమెరికా నుంచి వచ్చిన మిత్రుడికి ఈ విషయం చెప్పి అక్కడ ఇలా ఉండదు కదా అంటే 'అబ్బే ఇంత కాక పోయినా అక్కడ కూడా అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ ఉంటుంది 'అన్నాడు.
  ఇంతకీ వీళ్ళు ఫోన్లు ఎందుకు పెట్టుకొంటారబ్బా అంటే ఒకాయన అన్నాడు.అవి మీకోసం ,నా కోసం కాదు.వాళ్ళకోసమ్మాత్రమే.వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడడానికి  ,వాళ్ళకి ముఖ్యమైన వాళ్ళు వారికి ఫోన్ చెయ్యడానికే. !