11, సెప్టెంబర్ 2013, బుధవారం

naa amerikaa yaatra---8 (contd): నేస్తం

27-7-2013 నేస్తం:

ఈ రోజు అంతా బిజీగా గడచింది. నా బాల్యమిత్రుడు గొర్తి సత్యం (G.V.Satyanaaraayana moorti) న్యూయార్కు స్టేట్ లోనే కటోనా అనేప్రాంతంలో ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళడానికి మేము మధ్యాహ్నం 1-30 కి బయలుదేరి, గ్రాండ్  సెంట్రల్  స్టేషన్ నుంచి రైలు లో వెళ్ళాము. స్టేషన్ నిజంగానే 'గ్రాండ్ ' గా ఉంది. గంటంపావు ప్రయాణం తర్వాత కటోనా స్టేషన్ లో దిగాము. అక్కడనుంచి సత్యం మమ్మల్ని కారులో తీసుకొని వెళ్ళాడు. మా యీడు  వారైనా వారిద్దరూ కారు డ్రైవ్ చేస్తారు. అక్కడ తప్పదని చెప్పాడు. దారిలో అంతా పచ్చని చెట్లు, వనాలు, సరస్సులతో మనోహరంగా ఉంది.మా సత్యం వృత్తి రీత్యా అడ్వొకేట్. ఆయన సతీమణి ఇందిర మెడికల్ డాక్టర్. ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. పిల్లలు నలుగురు బాగా పైకి వచ్చి వేరే చోట్ల ఉంటున్నారు. ఇక్కడ అది మామూలే.

వాళ్ళ ఇల్లు పై గోడలతో సహా అంతా కలప (wood) తో కట్టినదే. కింద 2 హాల్సు, మేడమీద 2 పడక గదులు ఉన్నవి. వంటగది వేరే ఉంది. రెందు ఎకరాలస్థలంలో ఒకపక్క చిన్నచెరువు లేక కుంట (pond) ఉంది. అందులో చాల లిల్లీ పువ్వులు వికసించి ఉన్నాయి. చుట్టూ చెట్లు, పూలమొక్కలు, అంతా ఒక ఋష్యాశ్రమం లాగ ఉన్నది. మా సత్యంకి నాలాగే పుస్తక పఠనం అంటే ఆసక్తి. సెల్లార్ లో పెద్ద లైబ్రరీ ఉంది. డాక్టర్ ఇందిరకి ప్రపంచ యాత్రలంటే ఇష్టం. (wander lust) ఐదు ఖండాల్లోను అనేక యత్రాస్థలాలు దర్శించింది.

వాళ్ళ ఇంట్లో కొంతసమయం గడిపాక మళ్ళీ బయలుదేరి సాయంత్రం 5-30 కి న్యూయార్కు మాన్ హాటన్ చేరుకున్నాము. సాయంత్రం 7-30 గంటలకి లింకన్ సెంటర్లో (concert) కి వెళ్ళాము. దానికి ముందే టికెట్లు రిజర్వు చేసుకున్నాము.