7, సెప్టెంబర్ 2013, శనివారం

naa amerikaa yaatra --5: నయాగరా

9-7-13; 10-7-13:
ఈ రెండు రోజులు 'నయాగరా ' జలపాతంసందర్శనానికి ప్రత్యేకించాము. రైల్లో వెళ్ళమని అందరి సలహానిపాటించి అలాగే వెళ్ళాము. తెల్లవరటే లేచి 7-30 గంట రైలు లో బయలుదేరాము. ట్రైన్లో సౌకర్యంగానే ఉంది. కాని అంత వేగంగా వెళ్ళ  లేదు. 400 మైళ్ళకి 10 గంటలు తీసుకుంది. ఆశ్చర్యకరమేమంటే రైలు చార్జీలు విమానం చార్జీలతో సమానంగా ఉండటమే. ఆల్బనీ (Albany) వరకు 3 గంటలసేపు హడ్సన్ నది పక్కనే సాగింది. అక్కడ ఇంజన్ మారింది. పడమటినుంచి ఉత్తర దిశగా సాగింది. అక్కడనుంచి షెనక్డటీ (Schenectady), రోచెస్టర్ (Rochester), సైరాక్యూశ్ (Syracuse), ఆంస్టర్డాం (Amsterdam) మీదుగా బఫెలో (Buffalo) చేరింది. దాని తర్వాత స్టేషనే 'నయాగరా వాటర్ ఫాల్ల్శ్. కొందరు బఫెలో (Buffalo) విమానాశ్రయంలో దిగి వస్తారు. చాలా మంది రోడ్డు మీదుగా బస్సుల్లో, కార్లలో వస్తుంటారు. దారిపొడవునా పచ్చదనం నిండుగావుంది. రైలు మార్గం పక్కనే నదులు, కాలవలు, చెరువులు, చిట్టడవులు, కనుల పండువగా వుంది. ఇక్కడ ఎక్కువగా మొక్కజొన్న పండిస్తారు. దారిలో చిన్న, పెద్ద వూళ్ళు తీర్చిదిద్దినట్లు శుభ్రం గా ఉన్నాయి. గ్రామాలన్నీ తిన్నని రోడ్లు, చెక్క, ఇటుకలతో కట్టిన కాటేజెస్ (cottages) తో అందంగా ఉన్నాయి. పైన చెప్పిన పెద్ద పట్టణాలలో పేరుపొందిన యూనివర్సిటీలు ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు ఇతరప్రాంతాలనుంచి, ఇతరదేశాలనుంచి కూడా వచ్చి చేరుతూ ఉంటారు.

నయాగరా స్టేషన్ లో దిగాక టాక్సి (taxi) 'డేస్ ఇన్ 'Days Inn' అనేమంచి హోటల్ లో దిగాము. ఇక్కడికి ఫాల్స్ దగ్గరే. తయారై, కాఫీ తాగి, ఒక తోటలోంచి వెళ్ళి ఒక టవర్ (tower ) మీది నుంచి లిఫ్టులో దిగి రేవు దగ్గరీ చేరుకున్నాము. అక్కడ పెద్దలాంచీ ఎక్కి జలపాతం దగ్గరికి వెళ్ళాము. ఇది అర్ధచంద్రాకారంలో, కొంత అమెరికా లోను, కొంత కెనడా లోను ఉన్నది. గ్రేట్ లేక్స్ (Great  Lakes) లోని నీరు పొంగి పొరలి నదిగామారి ఇక్కడ కొండల మీదినుంచి కిందికి దూకి సరస్సుగా మారి  మళ్ళీ నదిగా ప్రవహిస్తుంది. అమెరికన్  నేటివ్ భాషలో  THUNDERING WATER" అని దీని అర్థం. నిజంగానే జలపాతం ఉరుముతూ, హోరెత్తిస్తూ చాలా దూరం వినిపిస్తుంది. maid of the mist అనే పేరుతో మా ప్రయాణం సరస్సు చుట్టూ కొనసాగింది. కెనడా ఫాల్స్ సమీపిస్తున్నకొద్దీ  నీటి తుంపరలు వర్షంలాగ పడుతూ ఉంటాయి. అందుకే ప్లాస్టిక్ ఏప్రన్, టోపీ ఇస్తారు. అసలు ఫాల్స్ కి బాగా దగ్గరికి వెళ్ళేసరికి జలపాతం కనిపించదు. దట్టమైన పొగమంచు (mist) వలె ఉంటుంది. అమెరికన్, కెనేడియన్ విభాగాల జలపాతాలను చూసాక ఒక వంతెన దాకా వెళ్ళి తిరిగి లాంచి రేవు లోకి వస్తుంది. 200 అడుగుల ఎత్తు నుంచి దూకే ఈ జలపాతం కన్నా ఇంకా ఎత్తైన జలపాతాలు ప్రపంచంలో ఇంకా వున్నాయి. కాని ఇంత నీటి పరిమాణం ఉన్నవి (volume of water) ఉన్నవి మాత్రం లేవు. ఈ బృహజ్జలపాతాన్ని స్వయంగా చూడవలసిందే కాని వర్ణించ వీలుకాదు. తర్వాత ఒక బస్సులో చుట్టూఉన్న పార్కుల నుంచి వివిధ కోణాల్లో జలపాతాన్ని చూడగలిగాము.  (ఇంకా ఉంది)
















కామెంట్‌లు లేవు: