లింకన్ సెంటర్ లో 6 పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఇది మాన్ హాటన్ లో ప్రధాన కళావేదిక అనవచ్చును. రోజూ వీటిలో ఏవో ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. మధ్యలో ఒక జలయంత్రం (water fountain) వెలుగులు చిమ్ముతూ ఉంది.
థియేటర్లు, ఒపెరాహాల్స్, కాన్సర్ట్ హాల్స్, ఫలహారశాలలు, పెద్ద్ షాపులు ఉన్నవి. అందులో ఏవరీ ఫిషర్ హాల్ (Avery fisher hall ) కి టికెట్లు తీసుకొని వెళ్ళాము. అందులో బీథోవెన్,మొజార్టు సంగీత కచేరీ జరుగుతున్నది. సరిగా 7-30 కి ప్రారంభమై 9 గం. కి ముగిసింది. మోజార్ట్ 40 బీథోవెన్7 వ సింఫనీ, వాయించారు. 40 మంది వాద్యకారులు, వయొలిన్స్, సెల్లోలు, ఫ్లూట్స్, సాగ్జోఫోన్స్, డ్రంస్ తో బృందం బాగా ప్రదర్శన ఇచ్చారు. కండక్టర్ బాగా ప్రసిద్ధుడైన 'లూయీ లాంగ్రి. '
మన కచేరీలకి పాశ్చాత్యుల వాటికీ కొన్ని తేడాలున్నాయి.
1.ప్రకటించిన సమయానికి సరిగ్గా మొదలుపెడతారు.
2.కచేరీ జరిగినంతసేపు నిశ్శబ్దంగా ఉండాలి.
3.ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వారు రావడం, పోవడం కుదరదు. ఒక ప్రదర్శన ముగిసిన తర్వాతే శ్రోతలు చప్పట్లతో వారి అభినందనలు తెలియజెయ్యాలి కాని మధ్య మధ్యలో చెయ్యకూడదు.
4. సన్మానాలు, దీర్ఘప్రసంగాలు, వీ.ఐ.పీ.ల కోసం వేచి ఉండటం ఉండదు.
సరిగా వీళ్ళ లాగే మనం చెయ్యాలి అనను; మన పద్ధతులు సంప్రదాయాలు మన కుంటాయి కాని సమయపాలన, నిశ్శబ్దం పాటించాలని నా అభిప్రాయం.
శాస్త్రీయ సంగీతమైనా హాలు నిండిపోయింది. 2 వేలమంది వచ్చిఉంటారు. వేదిక చుట్టూ ఉన్న గాలరీలే కాక, పెద్ద, చిన్న బాల్కనీలన్నీ నిండిపోయాయి. మన ఆంధ్రదేశంలో శాస్త్రీయ కళలకి లభించే ఆదరణ గూర్చి తలచుకొంటే బాధ కలుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి