5, సెప్టెంబర్ 2013, గురువారం

naa amerikaa yaatra--2: New York లో తొలి ఉదయం

రాత్రి భోజనం చేసి , నిద్రపోయి, ఉదయం లేచి చూసాను. నాకు 'జెట్ లాగ్' అనేది అనిపించలేదు. ఒకపక్క హడ్సన్ నది ప్రవహిస్తూఉంది. మన కృష్ణా నదికన్న చిన్నదే ఐనా పెద్దనది అనే చెప్పాలి. ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే సముద్రంలో కలుస్తుంది. పెద్దనౌకలు కూడా దీని ముఖద్వారం ద్వారా లోపలికి ప్రవేశించే అంత లోతు గా ఉంది. ఇక చిన్ననౌకలు, లాంచీలు, మరబోట్లు, తెరచాపపడవలైతే నిత్యం తిరుగుతూనే ఉన్నాయి. నదికి ఆవలి గట్టు పైనే 'న్యూజెర్సీ నగరం ఉంది. అందులో వేలమంది తెలుగువాళ్ళు నివసిస్తూ ఉంటారన్నసంగతి తెలిసిందే కదా. అన్ని అపార్ట్ మెంట్ల లాగే మావాళ్ళ అపార్త్ మెంట్కి కూడా పెద్ద గాజుకిటికీలు అమర్చబడి ఉన్నవి. కిటికీ అంటే గోడ అంతా ఆక్రమించి ఉంది. కాని అద్దాలు చాల గట్టివి, పగలవు. పిల్లలు పొరబాటునైనా తెరవకుండా లాక్ చేసి ఉన్నాయి. ఎందుకంటే కిటికీలకి మనలాగ గజాలు, గ్రిల్స్ ఉండవు.

చుట్టూ ఆకాశ హర్మ్యాలు (high rise buildings, sky scrapers) పోటీ పడుతూ ఉన్నాయి. కొంత దూరంగా 'ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (empire state building) కనిపిస్తూఉంది. రాత్రిపూట దీనిని రంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. చూడ మనోహరంగా ఉంటుంది. టికెట్ కొని 100 అంతస్తుల యీ బిల్డింగు పై కెక్కి చూడవచ్చును. అది ఒక వింత అనుభవం. ఇంకా దూరంగా పడిపోయిన వర్ల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ స్థానే కట్టిన కట్టడం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అపార్ట్ మెంట్లు నేల, లోపలిగోడలు చెక్కతో చేసి ఉంటాయి. కాని చెద పట్టకుండా ట్రీట్ చేస్తారు. బలంగానే ఉంటాయి. కాని ఒక్క బాత్ రూంస్ లోతప్ప ఇంకే గదిలోను నీళ్ళు పొయ్యడానికి కడగడానికి వీల్లేదు. ఒక్క స్తంభాలు (columns) మాత్రం సిమెంట్ కాంక్రీట్ తో కడతారు. మామూలుగా ఫ్లాట్స్  ఫర్నీచర్ తో సహా అద్దెకివ్వబడతాయి. Manhattan (మన్హట్టన్) లో అద్దెలు చాలా ఎక్కువ. 5,000 డాలర్ల నుండి 10,000 డాలర్ల దాకా ఉంటాయి. మా వాళ్ళకి మాత్రం స్టేట్ బాంక్  ఫ్రీగా ఇచ్చింది, జీతంలో భాగంగా .  











   

కామెంట్‌లు లేవు: