ఆగస్టు 4 న మా వాళ్ళతో కలసి విమానంలో న్యూయార్కు లో బయలుదేరి 5వ తేదీన క్షేమంగా హైద్రాబాదు చేరుకున్నాము. తిరుగు ప్రయాణం సాఫీగా జరిగిపోయింది.
అమెరికా గురించి నా భావనలు (impressions): ఒక దేశం గురించి బాగా తెలుసుకోవాలంటే ఆ దేశంలో ఒక ఏడాదిపాటు ఉండి, ప్రజలతో పరిచయం చేసుకొని, దేశమంతా తిరిగి అధ్యయనం చేస్తేనే నిజ పరిస్థితి కొంతైనా తెలుస్తుంది. నేను చూసింది తూర్పుతీరంలో ఈశాన్యభాగమే. ఇది బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. చాలా పెద్దదైన అమెరికాలో లోపల, ఎడారులు, వర్షాభావప్రాంతాలు కూడా ఉన్నవి. ఐనా నేను చూసి తెలుసుకొన్నంత వరకు మాత్రం వ్రాస్తున్నాను.
1. అమెరికా అప్పుల్లో ఉంది, ఆర్థికసంక్షోభంలో ఉంది అంటారు కాని స్థూలదృష్టికి మనకు అంతా బాగనే ఉన్నట్లు అనిపిస్తుంది.
2. అమెరికాలో జీవన వ్యయం బాగా ఎక్కువ; ఐతే ఆదాయాలు కూడా బాగా ఎక్కువే. పేదరికం లేకపోలేదు కాని, బాగా తక్కువే. భారత్ కన్నా బాగా వైశాల్యంలో పెద్ద దేశం. జనాభా తక్కువ. మంచి నీరు,విద్యుత్, రోడ్ల వంటి ప్రాథమిక అవసరాలు అందరికి అందుబాటులో ఉన్నాయి.
3. ఇక్కడ infrastructure బాగుంది. ఐతే పెరిగిన జనాభా, అవసరాలకి తగినట్లు ఇంకా అభివృద్ది చేద్దామంటే డబ్బుచాలదు. కొన్ని నగర పాలక సంస్థలు దివాలాతీసాయి.
4. కార్లకిచ్చిన ప్రాముఖ్యం బస్సులకీ, రైళ్ళకీ లేదు. చాలా చోట్ల బస్సులు దొరకవు. రైళ్ళు నెమ్మదిగా నడుస్తాయి. జపాన్ లోలాగ వేగంగా నడవవు. రైలు చార్జీలు కూడా బాగా ఎక్కువ. public transport కి ప్రాముఖ్యత లేదు.
5. హైస్కూలు విద్య వరకూ అందరికీ ఉచితం, నిర్బంధమూ. ఉన్నత విద్య మాత్రం చాలా ఖరీదు. అందువలన చాలా మంది పై చదువులు చదవ లేకపోతున్నారు.పై చదువులు చదవాలంటే పెద్ద మొత్తంలో అప్పు చేయాలి. ఇక్కడ జబ్బుచేస్తే చాలా కష్టమే. వైద్య ఖర్చులు చాలా ఎక్కువ. అందరికీ ఇన్షూరెన్సు లేదు. అందుకే అద్యక్షుడు ఒబామ తగిన చర్యలు తీసుకుంటున్నారు.
6. వ్యక్తి స్వేచ్చకు ప్రాముఖ్యమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు.
7. సింగిల్ పేరెంట్ కుటుంబాలు 30 శాతం ఉన్నాయి. దీనికి కారణం విడాకులు, లేక అసలు పెళ్ళి లేకుండా ఉండటం.
8.high technology, యుద్ధ సామగ్రి (armaments) ఉత్పత్తి ఎక్కువ. కాని వినిమయ వస్తువుల ఉత్పత్తి బాగా తక్కువ. ఎలక్ట్రానిక్ ప్రాడక్ట్స్, గృహోపకరణాలు, అన్నీ ఇతరదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు. బజార్లలో made in U.S.A.అని ఏ వస్తువు మీదా ముద్ర కనబడదు. రోడ్ల మీద జపాన్ వారి హోండా, టొయోటా, నిస్సాన్ కార్లే ఎక్కువ కనబడ్తాయి. అమెరికన్ కార్లైన Ford , General Motors, Chrylser మరీ ఎక్కువగా కనబడ లేదు.
9. సామాన్య ప్రజలకి పొదుపు తక్కువ. విలాసాలకి బాగా ఖర్చు పెడతారు. పిలలు పెద్దవగానే విడిపోయి వేరే జీవిస్తూఉంటారు.
10. ప్రభుత్వ ఉద్యోగాలు బాగా తక్కువ. ప్రైమరీ టీచర్లు, అగ్ని మాపక దళం, పోలీసుల వంటివి కొన్ని తప్ప, ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూనో , లేక స్వతంత్రం గానో బతుకుతుంటారు. ఐతే నిరుద్యోగులు, వృద్ధులు మొదలైనవరికి, సోషల్ సెక్యూరిటీ కింద ప్రభుత్వం కొంత భరణం చెల్లిస్తుంది.
చివరిమాట. ఒకమనిషిని 10,20, సంవత్సరాలు రోజూ చూస్తుంటే మనకు పెద్ద మార్పు కనబడదు. అదే మరొకరు చాలాకాలం దూరంగా ఉండి చూస్తే చాలా మార్పు కనిపిస్తుంది. స్వతంత్రం వచ్చి60 ఏళ్ళైనా దేశం అలాగే ఉందని మనవాళ్ళు రాస్తూఉంటారు. కాని,నా అమెరికా మిత్రుడు సత్యం గారు మన దేశం, ప్రజలు, అన్నిరంగాల్లో చాలా అభివృద్ధి చెందిందని, బాగా మారిపోయిందని అంటారు. 2050 నాటికి ఇంకా చాలా అభివృద్ధి చెంది ప్రపంచంలో ఒక అగ్రరాజ్యమౌతుందని ఆయన అభిప్రాయం. అదే నిజం కావాలని మనమంతా ఆశిద్దాము.
(అమెరికా యాత్ర సమాప్తం)