5, సెప్టెంబర్ 2013, గురువారం

naa amerikaa yaatra--2: New York లో తొలి ఉదయం

రాత్రి భోజనం చేసి , నిద్రపోయి, ఉదయం లేచి చూసాను. నాకు 'జెట్ లాగ్' అనేది అనిపించలేదు. ఒకపక్క హడ్సన్ నది ప్రవహిస్తూఉంది. మన కృష్ణా నదికన్న చిన్నదే ఐనా పెద్దనది అనే చెప్పాలి. ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే సముద్రంలో కలుస్తుంది. పెద్దనౌకలు కూడా దీని ముఖద్వారం ద్వారా లోపలికి ప్రవేశించే అంత లోతు గా ఉంది. ఇక చిన్ననౌకలు, లాంచీలు, మరబోట్లు, తెరచాపపడవలైతే నిత్యం తిరుగుతూనే ఉన్నాయి. నదికి ఆవలి గట్టు పైనే 'న్యూజెర్సీ నగరం ఉంది. అందులో వేలమంది తెలుగువాళ్ళు నివసిస్తూ ఉంటారన్నసంగతి తెలిసిందే కదా. అన్ని అపార్ట్ మెంట్ల లాగే మావాళ్ళ అపార్త్ మెంట్కి కూడా పెద్ద గాజుకిటికీలు అమర్చబడి ఉన్నవి. కిటికీ అంటే గోడ అంతా ఆక్రమించి ఉంది. కాని అద్దాలు చాల గట్టివి, పగలవు. పిల్లలు పొరబాటునైనా తెరవకుండా లాక్ చేసి ఉన్నాయి. ఎందుకంటే కిటికీలకి మనలాగ గజాలు, గ్రిల్స్ ఉండవు.

చుట్టూ ఆకాశ హర్మ్యాలు (high rise buildings, sky scrapers) పోటీ పడుతూ ఉన్నాయి. కొంత దూరంగా 'ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (empire state building) కనిపిస్తూఉంది. రాత్రిపూట దీనిని రంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. చూడ మనోహరంగా ఉంటుంది. టికెట్ కొని 100 అంతస్తుల యీ బిల్డింగు పై కెక్కి చూడవచ్చును. అది ఒక వింత అనుభవం. ఇంకా దూరంగా పడిపోయిన వర్ల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ స్థానే కట్టిన కట్టడం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అపార్ట్ మెంట్లు నేల, లోపలిగోడలు చెక్కతో చేసి ఉంటాయి. కాని చెద పట్టకుండా ట్రీట్ చేస్తారు. బలంగానే ఉంటాయి. కాని ఒక్క బాత్ రూంస్ లోతప్ప ఇంకే గదిలోను నీళ్ళు పొయ్యడానికి కడగడానికి వీల్లేదు. ఒక్క స్తంభాలు (columns) మాత్రం సిమెంట్ కాంక్రీట్ తో కడతారు. మామూలుగా ఫ్లాట్స్  ఫర్నీచర్ తో సహా అద్దెకివ్వబడతాయి. Manhattan (మన్హట్టన్) లో అద్దెలు చాలా ఎక్కువ. 5,000 డాలర్ల నుండి 10,000 డాలర్ల దాకా ఉంటాయి. మా వాళ్ళకి మాత్రం స్టేట్ బాంక్  ఫ్రీగా ఇచ్చింది, జీతంలో భాగంగా .  











   

naa amerikaa yaatra: ఇండియా నుంచి అమెరికా విమానయానం

ఇటీవలి కాలంలో చాలామంది  అనకాప ల్లి వెళ్ళినట్లే అమెరికా వెళ్ళి వస్తున్నారు. కొందరు వారి యాత్రావిశేషాలు పత్రికల్లో రాస్తున్నారుకూడా. కొత్తగా నేను రాసేదేముంది అని అడగవచ్చును.కాని,ఎవరి అనుభవం వాళ్ళదే కదా?కొంతమందైనా అమెరికా గురించి తెలియనివాళ్ళూ ,తెలుసుకోదలచినవాళ్ళూ ఉండవచ్చును.వాళ్ళకోసమే  ఈ సంగతులు రాస్తున్నాను.
నాకు 80 సం;దాటడంవలన ,అమెరికా వీసా ఇంటర్వ్యూ లేకుండానే సులభంగానే లభించింది.పాస్ పోర్టు  అంతకు ముందే వుంది.మా అబ్బాయి టికెట్ పంపించాడు. అసలునేను 2001లోనే అమెరికా వెళ్ళాలనుకున్నాను.కాని, అప్పుడే న్యూయార్కు లోని world trade centre building twin towers ని టెర్రరిస్టులు కూల్చివెయ్యడం వలన యాత్రికులందరికీ కొంత కాలం పాటు అనుమతి లభించలేదు. అందువలన, అప్పుడు అమెరికా బదులు పశ్చిమ యూరప్ దేశాల యాత్రకు వెళ్ళి వచ్చాను. ఇప్పుడు మా పెద్దబ్బాయి న్యూయార్కులో ఉండటం చేత ఇన్నాళ్ళకి మళ్ళీ బయలుదేరాను.

నేను, 2013 జూన్ నెల 24న బయలుదేరి వైజాగ్ నుంచి హైదరాబాదు మా అమ్మాయి వద్దకువెళ్ళి, అక్కడనుండి జూన్ 27 న ఢిల్లీ వెళ్ళాను. అక్కడ విమానం మారి ఇమిగ్రషన్ పెర్మిట్ తీసుకొని న్యూయార్కు డైరెక్ట్ గావెళ్ళే AirIndia jetplane ఎక్కాను. అది అధునాతనమైనదని చెప్పారు.  కాని రాత్రి ఒంటిగంటన్నరకు బయలుదేరవలసినది, నాలుగు గంటలైనా  బయలు దేరలేదు. air conditioning system పనిచెయ్యలేదు. ఎంత ప్రయత్నించినా రిపైర్ కాలేదు. అప్పుడు మమ్మల్ని మరొక విమానంలోకి మార్చి  తెలవారి 7 గంటలకి international flight permit లభించలేదని, మమ్మల్ని దింపివేసి, న్యూఢిల్లీలోని అశోకా హొటల్ కి పంపించారు.

ఇలా అనుకోకుండా న్యూ ఢిల్లీ  కొంత మళ్ళీ చూసేందుకు వీలైంది. అశోకాహొటల్ రూంస్ కూడా బాగున్నాయి. రాత్రంతా నిద్రలేకపోవడం చేత  వెంటనే నిద్ర పట్టేసింది. 11గం| కి ఫోన్! 12గం॥ కి భోజనం చేసి సిద్ధంగా ఉండమని. లంచ్ తర్వాత మమ్మల్ని మళ్ళీ బస్సులో విమానాశ్రయం కి  తీసుకువెళ్ళారు. అక్కడ మళ్ళీ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తయాక మధ్యాహ్నం 3గంటలకి  బోయంగ్ విమానం ఎక్కించారు. తర్వాత ఏ ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా 15గంటల ప్రయాణం తర్వాత న్యూయార్కు విమానాశ్రయంలో సురక్షితంగా దిగాము. AIR INDIA వారి నిర్వాహకానికి ఇదొక మచ్చుతునక అనుకోవచ్చును. రూల్స్ ప్రకారం అంతా అయాక, 1 గంట తర్వాత బయటపడ్డాను.మా అబ్బాయి నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళేప్పటికి అమెరికా కాలమానప్రకారం రాత్రి 11 గంటలైంది.మా flight కి కలిగిన అంతరాయాలగురించి అప్పటికే వాళ్ళు తెలుసుకొని చాలా  కంగారు పడ్డారు.

ఈస్ట్ రివర్ పై వంతెన దాటి మాన్ హాటన్లో (Manhattan) రివర్సైడ్ వ్యూ లో హడ్సన్ (Hudson) నది ఒడ్డున వున్న ఒక పెద్ద బిల్డింగులో మావాళ్ళు 25వ అంతస్తు లో వాళ్ళ అపార్ట్ మెంట్లో ఉన్నారు. రాత్రి కావడం వల్ల దారిపొడూగునా విద్యుద్దీపకాంతులతో ఆకాశ హర్మ్యాలు వెలుగులు విరజిమ్ముతూ కనిపించాయి. మా అబ్బాయి, కోడలు, మనమడూ ఉన్నారు. మా పెద్దబ్బాయి  విజయలక్ష్మణ్  ఒక యూనివర్సిటీ లో ప్రొఫెసర్. కోడలు విజయలక్ష్మి స్థానిక State Bank of India లో మేనేజర్. మనమడు 10 వ తరగతి చదువుతున్నాడు.

2, సెప్టెంబర్ 2013, సోమవారం

kathaparvatipuram


 

 కథాపార్వతీపురం;;
--------------ప్రచురణ;స్నేహకళాసాహితి,పార్వతీపురం-2012;వెల ;రూ 250
 వందేళ్ళ కథా సంపుటాలు,ప్రాంతీయ కథాసంపుటాలు చూసాము.ఒకరచయిత తన స్వంతవూరిగురించి రచించిన కథాసంపుటాలు కూడా  చూసాము.(ఉదా; పసలపూడికథలు,దాక్షారామకథలు ) కాని ఈ కథాసంపుటి ఒకే వూరినించి వచ్చిన పెక్కు కథకులు రచించినది.మొత్తం 52 కథలలో నలుగురు రచయిత్రులు  మాత్రమున్నారు.6 గురు కీర్తిశేషులున్నారు.విజయనగరం జిల్లాలో చిన్నపట్టణమైన పార్వతీపురం నుంచి ఇంతమంది కథరచయితలు రావడం విశేషమే.తెలుగులో తొలి కథారచయితగాపేర్కొనబడే  కీ .శే.ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ గారి నుంచి(1903) వర్ధమానరచయిత్రి బెలగాం గాయత్రి వరకు ఇందులో సమకూరడం మరొక విశేషం.లబ్ధప్రతిష్ఠులైన కీ.శే.యస్.వి.జోగారావు,పంతులవిశ్వనాథరావు, భూషణం,లతోబాటు వర్తమాన  ప్రసిద్ధులైన శ్రీ యుతులు వి.వి.బి.రామారావు,వంగపండు ప్రసాదరావు,పంతులజోగారావు,చింతా అప్పలనాయుడు,బి.వి.ఏ.రామారావునయుడు,వాడ్రేవు చినవీరభద్రుడు ,గొల్లపూడిమారుతీరావు,అరుణపప్పు,ఏ.ఎన్.జగన్నాథశర్మ,గణేశ్ పాత్రో, అట్టాడ అప్పలనాయుడు,గంటేడ గౌరునాయుడు ,వంటి ప్రముఖకథారచయితలతో బాటు ఇతర మంచి కథకుల  రచనలు ఇందులో చాలా చేర్చబడ్డాయి.
 పార్వతీపురం మన్యం (agency) కి ముఖద్వారం.అడవుల్లో దొరికే వస్తువులు (products) వ్యాపారం జరుగుతూఉంటుంది.1970 నాటి శ్రీకాకుళం నక్సలైటు ఉద్యమనేపథ్యంలో గిరిజనుల,రైతుకూలీల పోరాటాల విశేషాలతో చాలాకథలువున్నాయి.సంప్రదాయ కులవృత్తుల విధ్వంసం. భూమితగాదాలు,  ప్రపంచీకరణ దుష్ఫలితాలు, alienation (పరాయీకరణ) ,ప్రధానంగా కథావస్తువులు.వీటితోబాటు మధ్యతరగతికుటుంబాల  విచ్చిన్నం,ఇబ్బందులు ,కష్టాలు కూడా కొన్ని కథల ఇతివృత్తంగా తీసుకోబడ్డాయి.
   చాలాకథలు ఉత్తరాంధ్ర పల్లెటూర్ల యాసతో చాలా వాస్తవికంగా ఉన్నాయి.ఎక్కడా కృత్రిమత్వం కనబడదు.ప్రాంతీయ సుగంధం( local flavour) బాగాపరిమళించింది.ఉత్తరాంధ్రులేకాకుండా అందరూ చదవవలసిన పుస్తకం.
   ఈ కథాసంకలనకర్తలు ఏ.అప్పలనాయుడు, జి.గౌరునాయుడు గార్లకి అభినందనలు.
     చాలా ప్రాంతీయ పల్లెటూరి యాస పదాలు ఇతర ప్రాంతీయులకు అర్థం కావు,చివరిలో పదాలకి అర్థాలు glossary వంటిది ఇచ్చివుంటే బాగుండేది. 

25, ఆగస్టు 2013, ఆదివారం

balasaraswati,singer




 ఈ రోజు (25-8-13)ABN  OPEN HEART WITH RKకార్యక్రమంలో రావు బాలసరస్వతీదేవి తో ఇంటర్వ్యూ గురించి నాలుగు మాటలు;మా చిన్నతనంలో, ఆవిడ పాడిన సోలో 'ఆతోటలో నొకటి ఆరాధనాలయము ' ,వంటి పాటలు,సాలూరు రాజేశ్వరరావు తో పాడిన 'తుమ్మెదా ఒకసారి ' వంటి డ్యూయట్లు చాలా పాపులర్ గా   ఉండేవి.అవి ప్రైవేటు  గ్రామొఫోన్ రికార్డులు.సినిమాల్లో కూడా పాపులర్ పాటలు చాలాపాడారు.జమీందార్ కుటుంబంలో వివాహమయ్యాక  తగ్గించవలసివచ్చినా 50,60,ల దాకా కొన్ని మంచి పాటల్ని తెలుగు,తమిళ సినిమాల్లో పాడారు.15 సం;క్రితం మద్రాసు వెళుతున్నప్పుడు  మాతో రైల్లో కలిసి ప్రయాణం చేస్తూ చాలా కబుర్లు చెప్పారు.మా వాళ్ళ కోరికమీద మెల్లగా కొన్ని పాటలు కూడా పాడారు.ఈరోజు ఇంటర్వ్యూలో  రెండు విషయాలు తప్ప అంతా నిజాయతీగానే చెప్పారు.బహుశా ,unpleasant  truths  అని వదిలివేసిఉండొచ్చును.బాలసరస్వతి కంఠం  మధురంగా ఉంటుంది.కాని తారాస్థాయి (high pitch )లో ఇబ్బంది అవుతుంది.ఆశ్చర్యమేమంటే ,ఆవిడకన్నా బాగా జూనియర్స్ ఐన సుశీల,జానకి ఇప్పుడు  వణుకు వలన  బాగా పాడలేకపోతుంటే  ఈవిడ గొంతుకలో మాత్రం పెద్దమార్పేమీ లేక బాగా పాడ గలగడం.ఇక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,సినిమా పరిశ్రమ ఆమె పై చూపించిన నిర్లక్ష్యం గురించి  ఆవిడ నోటంటే విన్నారు కాబట్టి మళ్ళీ రాయనవసరం లేదనుకుంటాను. 

11, జూన్ 2013, మంగళవారం

Bezawada Rajaratnam




 1938-1948 మధ్యలో బెజవాడరాజరత్నం అనే గాయని ప్రసిద్ధిలో ఉండినది.ప్లేబ్యాక్  పాటలు పాడేది.కొన్ని సినిమాల్లో నటించి ,పాడేది.ప్రవేటురికార్డులు ,ఇచ్చి,కచేరీలు కూడా చేసేది.'దేవత ' అనే సినిమాలో,ఆమె పాడిన 'రాదే చెలీ నమ్మరాదే చెలీ  ' అనేపాట ఆ రోజుల్లో,  మారుమోగిపోయింది.1950 తర్వాత బహుశా లీల ,జిక్కి,సుశీల వంటి సింగర్సు పైకి రావడం వలన కనుమరగైపోయింది.
 '  భక్త పోతన ' లో ఇది మంచి సమయము  రారా రారా ' అనే జావళి,'మాయలోకం ' లో 'చెలియా  మనకేలనే ' అనేది చాలా బాగుంటాయి. మంచి కంఠస్వరం,సంగీత జ్ఞానము ఉండేవి.సుప్రసిద్ధ గాయనీమణులు, టంగుటూరి సూర్యకుమారి,బాలసరస్వతీదేవి ఆమె సమకాలికులు.         

bezawada rajaratnam




 1938-1948 మధ్యలో బెజవాడరాజరత్నం అనే గాయని ప్రసిద్ధిలో ఉండినది.ప్లేబ్యాక్  పాటలు పాడేది.కొన్ని సినిమాల్లో నటించి ,పాడేది.ప్రవేటురికార్డులు ,ఇచ్చి,కచేరీలు కూడా చేసేది.'దేవత ' అనే సినిమాలో,ఆమె పాడిన 'రాదే చెలీ నమ్మరాదే చెలీ  ' అనేపాట ఆ రోజుల్లో,  మారుమోగిపోయింది.1950 తర్వాత బహుశా లీల ,జిక్కి,సుశీల వంటి సింగర్సు పైకి రావడం వలన కనుమరగైపోయింది.
 '  భక్త పోతన ' లో ఇది మంచి సమయము  రారా రారా ' అనే జావళి,'మాయలోకం ' లో 'చెలియా  మనకేలనే ' అనేది చాలా బాగుంటాయి. మంచి కంఠస్వరం,సంగీత జ్ఞానము ఉండేవి.సుప్రసిద్ధ గాయనీమణులు, టంగుటూరి సూర్యకుమారి,బాలసరస్వతీదేవి ఆమె సమకాలికులు.         

S.P.B.




  ఏ గ్రేడు సంగీతదర్శకులు, రచయితలు సమకూర్చిన మంచి పాటల్నెన్నో పాడి గత 40 సంవత్సరాలుగా ఎంతో ధనమూ,కీర్తి,సంపాదించుకున్న S.P.బాలసుబ్రమణ్యంకి ఇప్పుడు బీ గ్రేడు సంగీతదర్శకులు,రచయితలని మెచ్చుకుంటూ ప్రోగ్రాములు నిర్వహించవలసిన  అవసరం ఉన్నదా?