25, సెప్టెంబర్ 2011, ఆదివారం

my motto


 


 ' నా తెలంగాణ కోటి రత్నాల వీణ '
   రత్న ఖచిత కిరీటమ్ము రాయసీమ
   దివ్య కాంచన రథము మా తీర భూమి
   వెలుగు ముప్పేట హారమ్ము తెలుగునాడు.
  పై పద్యంలో మొదటి పాదం అందరికీ తెలిసిన దాశరథి పద్యంలోనిది.మిగిలిన మూడు పాదాలూ నేను వ్రాసినవి.పై పద్యమే నా
 నిశ్చిత అభిప్రాయం.నేను అంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలనూ,అన్ని జిల్లాలనూ ప్రేమిస్తాను.ఆంధ్రులు అంటే అన్ని  జిల్లాలవారూ. అజ్ఞానం వలననో దురుద్దేశం తోనో ఈ విషయం సామాన్యులకు కవులు, రచయితలు,పత్రికల వారూ,టీ.వీ,ల వారూ ఎందుకు చెప్పడం లేదో తెలియదు.ఇప్పటి ఉద్రిక్త వాతావరణంలో ఇంతకన్న వ్రాయ దలచుకో లేదు.  

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

కమనీయం: okageyam-niraasa

కమనీయం: okageyam-niraasa

okageyam-niraasa


 

  భిక్షకుడొకడిని-బీద అరుపులవాణ్ణి
  వీధుల కూడలిలో -వెళ్తూ చూశాను
  భయపడకు బీదల-ప్రభుత్వం వస్తుంది
  బాగుపడుతుంది నీజీవితం -భరోసా ఇచ్చాడొక సోషలిస్ట్
  మురిగిపోయిన వ్యవస్థే - మూలకారణం
  తిరగబడమన్నాడు- తీవ్రవాది ఒకడు
  గతజన్మలో పాపాలే-కారణం నీ స్థితికి
  ప్రాయశ్చిత్తం చేసుకో -పదమన్నాడు మతగురువు
  బలంగావున్నావు కదా- పనిచేసుకోలేవా
  కష్టపడుపొమ్మని- కసిరాడు కేపిటలిస్ట్
  అమ్మాయిల అందం - ఆరాధించే అబ్బాయి
  ఏమిటి యీ న్యూసెన్స్- ఇక్కడనుండి పొమ్మన్నాడు
  పదిరూపాయలు చేరితే- పట్టెడన్నం తినాలన్న
  బిచ్చగానికి నిరాశే- మిగిలింది చివరకి .              

కమనీయం: oka padyam,kalingaseema

కమనీయం: oka padyam,kalingaseema

oka padyam,kalingaseema


 

 వంశధారాతీర వసుమతి యంతయు
       ప్రాక్తన నిర్మాణ భరిత భూమి
 బౌద్ధచైత్యవిహార భవ్యవిద్యాలయ
       సకలదేశాగమ చ్చాత్రవితతి
 శత్రుభీకర మహాసామ్రాజ్య విస్తృత
       సేనానికరముల చెలగునేల
 సాగరాంతర వణిక్ సంపద్విభవార్జ
       నమున లక్ష్మీ సదనమ్ము గాగ
     నగరికటకశ్రీకాళింగ నగరప్రముఖ
     శ్రీముఖక్షేత్ర దంతపురీమహేంద్ర
     శైలశాలిహుండాది ప్రశస్త దివ్య
     క్షేత్రముల నలరారె నీ సీమ మున్ను. 

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

nidra


  
 తల్లి  యొడి లోన వెచ్చగ తనువు మరచి
 శాంత్యమాయక భావాల స్వాదురసము
 నీలి కన్నుల రెప్పల నిదుర గ్రమ్మ
 చింత లెరుగని పొన్నారి చిట్టిపాప
            ---------
 ప్రేమికుని కౌగిలిని చేరి ప రియవధూటి
 సేద దీరంగ స్వప్నాల చిత్రరచన
 వాలుగన్నుల నర్తింప లీల నగవు
 మోము నలరింప నిద్రించు ముగ్ధ హృదయ
             -----------
 వెతల ,రుగ్మత  భారాన వేసరిల్లి
 నిద్ర రానట్టి సుదీర్ఘ నిశల యందు
 ఘడియలను లెక్కపెట్టుచు గడుపుచుండు
 కొంత దనుకను ముదిమిని కునుకు పట్టు .
              -----------
  

8, సెప్టెంబర్ 2011, గురువారం

arudra-contd

 
 ఈ ధరణి అంతా పుణ్యభూమే అంటూ
    ''దేవుడిచటే వెలసెనంచు =తెలివిహీనులు భ్రాంతిపడుచు
       చావుకోసము వలసపోయి =సతమతంబవనేల భాయి
       ఈ వసుంధర మేనుపైన =ఏవొక్క అంగుళంబైన
       పావనమ్మే ,పుణ్యవహము =వారణాసే స్వంతగృహము
   జనులు పాడుకొనే పాటే పండిత కావ్యాలకన్నా ముందు పుట్టిందని ఆరుద్రగారి అభిప్రాయం
      ''గేయమే ముందు పుట్టింది = హాయిగా జాతి నవ్వింది
        వేయిపేరుల లక్షణమ్ము =వెనుక వచ్చిన దుప్పికొమ్ము
        తీయతీయని నాటు  పాట =దేశీయ సంపదల మూట
        హేయమైనది పండితులకు =ఇల సంస్కృతపు హెచ్చు కొరకు ''
   పండితుల శుష్కవాదాల గురించి చమత్కారం
        ''వీపులో అరసున్నవుందా= వెర్రి శకటములెక్కుతుందా ?
          ఆపదం వ్యుత్పత్తి ఎల్లా =అన్యదేశ్యం మనకు డిల్లా
          ఈ పగిది చర్చించువాళ్ళు = ఇతరులకు పదపిచ్చివాళ్ళు
          వ్యాపకం వ్యాకరణవృత్తి =జ్ఞాపకాలకు కొంతనత్తి ''
     ఇంకా అక్కడక్కడ మంచి చమక్కులు కనిపిస్తాయి,
     ''ఆలయము నేడు ఆఫీసు=అర్చనకు కట్టాలి ఫీజు ''
   బలహీనులైనా తిరగబడితే పాలకులు లొంగిపోవలసిందే నని హెచ్చరిక
      ''నలుసు చాల అలుసుగాని=నయనాల పడినచో హానీ'
      ఐతే అందరు కవులలాగే ఆరుద్ర కూడా'' ఏకాలమందు మగవాడు ఇంతి హృదయము నరయలేడు '' అంటారు.కాని నిజం చెప్పాలంటే ఆడ ఐనా మగ ఐనా ఇతరుల హృదయం అర్థం చేసుకోడం కష్టమే .
   ఈ చిన్న కావ్యం (శుద్ధ మధ్యాక్కరలు) విశిష్టత
      1.పద్యాలని పాటగా మలచటం 2.సరళమైన  శిష్ట వ్యావహారికంలో వ్రాయడం.3.ఉర్దూ ,ఇంగ్లిష్ పదాలను విరివిగా వాడడం4. వివిధ విషయాలపై తన చమత్కారశైలిలో విమర్శించడం.5.తన ముద్ర ఐన అంత్యప్రాసలను కొనసాగించడం .6.మధ్యాక్కరల గణవిభజననీ ,ఆదిప్రాసనీ ,యతిస్థానాన్ని తప్పక పాటించడం .
                   (సమాప్తం)