విశాఖా!ఓ విశాఖా,నావిశాఖా!
----------------------
పసిప్రాయంలో నీ వడిలో పరుండితి,
నీలతరంగ హస్తాలతో నిమిరావు నన్ను.
ఎల జవ్వనములో కోరి వలచాను నిన్ను,
తరులతా కుంతలాల మురిపించావు నన్ను
సుందర విశాఖా!విలాసరేఖా!
నీ శైల కందరాలలో
సానుప్రదేశాలలో
సైకతచుంబిఫేనరాశుల్లో
సంధ్యామారుతసౌరభాల్లో
చంద్రోదయసువర్ణరోచుల్లో
అలలపై జలతారుదారుల్లో
ఉదయారుణజలదపంక్తుల్లో
ఆడియాడి అలసి నిదురించాను
సుందరవిశాఖా! విలాసరేఖా!
సుదూరంలో నౌకోపరితలం నుండి
నీహారదుకూలపరీవృతమైన
నీ తీర సౌభాగ్యాన్ని తిలకించినాను .
తిలకించి,తిలకించి పరవశించాను
సుందరవిశాఖా!విలాసరేఖా!
విశాఖా!,ఓ విశాఖా,నా విశాఖా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి