ఈ మధ్య రెండు నవలలు చదివాను.రెండూ ' వాహినీ బుక్ ట్రస్ట్,హైదరబాదు 'వారు ప్రచురించినవి.' రచన 'మాసపత్రికలో ధారావాహికంగా వచ్చినవి.
1.'తపన '-రచయిత;కాశీభట్ల వేణుగోపాల్.; వెల;రూ.60\
చైతన్యస్రవంతి విధానంలో రచించినది.ముఖ్య పాత్ర subconscious లోని భావతరంగాలని పైకి వెలిబుచ్చుతూ ,దాచకుండా రాసినదీ.4,5,రోజులలో భార్యాభర్తల మధ్య జరిగిన సంఘటనలనీ,వారి సంబంధాలనీ యథాతథంగా చిత్రించారు. కాని, వారిద్దరికీ ఎందుకు,వైమనస్యమో,ద్వేషమో అర్థంకాదు.అందుకు బలమైన కారణాలు కనిపించవు.చివరకు,భార్య గర్భవతి ఐందని తెలియగానే మళ్ళీ పరస్పరం సామరస్యం,అనురాగమూ కలుగుతాయి.ఇందులో హీరో తాగుబోతు,వ్యభిచారి.కాశీభట్ల నవలల్లో ఈ గుణాలు ఎక్కువగా కనిపిస్తాయి.బహుశా,ఇవి లోకంలో సహజమూ,సామాన్యమూ ఐపోయాయి కాబట్టి తప్పులేదని రచయిత ఉద్దేశం కావచ్చును.
ఈ నవలకు 1999 లో 'తానా-స్వాతి ' నవలల పోటీలో లక్ష రూపాయలు బహుమతి వచ్చిందట.
2.ఐ.సి.సి.యు.(I.C.C.U.) రచన;డా.చిత్తర్వు మధు.వెల 100\ రూ.
ఇది కూడా 'రచన ' పత్రికలో సీరియల్ గా వచ్చింది.మెడికల్ థ్రిల్లర్ genre కిందికి వస్తుంది.ఒక పెద్ద హాస్పటల్ లో గుండెజబ్బుల కు నిర్దేశించిన ఎమర్జెన్సీ I.C.C.U. వార్డులో ఒక నిపుణుడు గుండె చలనాల్ని సరిగా నియంత్రించే పేస్ మేకర్ pace maker ' అనే పరికరాన్ని అమర్చుతుంటాడు.ఇది సామాన్యంగా జరిగే ప్రక్రియే.కాని దుష్టస్వభావమూ, దురాశా ,అమితమైన ambition కల అతదు ఆ పరికరంలోనే రోగి మెదడుని కంట్రోలు చేసే మరొక చిన్న పరికరాన్ని కూడా చేర్చి దాని ద్వారా ధనవంతులైన రోగుల నుంచి డబ్బు సంపాదిస్తాడు.అంతటితో ఆగక తన దగ్గర గుండె జబ్బు కనివచ్చిన రాష్ట్ర ముఖ్య మంత్రి ని కూడా ఆ పరికరంతో కంట్రోలు చేస్తాడు.ఈ లోగా కొత్తగాచేరిన మంచి డాక్టర్ అనుమానించి ,పరిశోధించి ఆ కుట్రను భగ్నం చేస్తాడు.విలన్ డాక్టర్ అగ్నిప్రమాదంలో చనిపోతాడు.
ఉత్కంఠతో చకచకా సాగే నవల ,ఆసక్తితో చదివిస్తుంది.రచయిత డాక్టర్ కాబట్టి మెడికల్ నేపథ్యాన్ని బాగా చిత్రింప గలిగారు.ఇంగ్లీషులో వచ్చిన రాబిన్ కుక్ మెడికల్ థ్రిల్లర్లని తలపింపజేస్తుంది.