మింగ్ వంశం 1368 నుంచి 1644 వరకు దాదాపు మూడు శతాబ్దాలు చైనా సామ్రాజ్యాన్ని పరిపాలించింది.ఇందులో కొందరు రాజులు అసమర్థులైనా,మధ్యలో కొన్ని అపజయాలు పొందినా రాజ్యాంగయంత్రం పటిష్టం గా ఉండటం వలన పరిపాలన బాగానే సాగింది.మొత్తం 16 చక్రవర్తులు పరిపాలించారు .మంగోలియా,కొరియా,జపాన్లపై దండయాత్రలు విఫలమైనవి.అన్నాం (నేటి వియత్నాం ) ని ఆక్రమించినా తీవ్రమైన తిరుగుబాట్ల వల్ల నిలబెట్టుకోలేక ఉపసమ్హరించు కోవలసి వచ్చింది.కాని,మిగతా సామ్రాజ్యమంతా శాంతి భద్రతలు నెలకొన్నాయి.కళలు,చేతి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.నవలలు రచించ బడ్డాయి.అందులో ఒకటి - పూర్వం హుయెన్ త్సాంగ్ భారత దేశ యాత్ర అనేక కల్పనలతో రచింప బడినది.విదేశాలతో వర్తకం ,దేశంలో పంటలు ,వాణిజ్యం అభివృద్ధి చెందాయి.40 ప్రధాన నగరాలు ఉన్నట్లు యూరపియన్ యాత్రికులు రాసారు.అంతకుముందు నుంచే వున్నా ఈ కాలంలో, పింగాణీపరిశ్రమ (porcelain),సిల్కు వస్త్రాలు, కాగితం,ముద్రణ,ఇంకా అభివృద్ధి చెందాయి. సిల్కు బట్టలపై చిత్రలేఖనం చైనా వారి ప్రత్యేకత.
ఈ కాలంలో జరిగిన మరొక ముఖ్యమైన విషయం - 6సార్లు పెద్ద నౌకాదళం ఆగ్నేయ ఆసియాదేశాలు, శ్రీలంక,మనదేశంలో మలబార్ తీరం ,పెర్షియన్ సింధుశాఖ ,ఆఫ్రికా తూర్పు తీరాలను చుట్టిరావడం.కాని సముద్రాంతర వలసరాజ్యాలు మాత్రం స్థాపించలేదు.(ఒక శతాబ్దం తర్వాత యూరపియన్ దేశాలు ఆ పని చేశాయి ) ఇంత గొప్ప నౌకలని అంతవరకు ఏ దేశమూ తయారు చేయలేదట .కాని ఆ తర్వాత ఎందుకో చైనా నౌకాదళాన్ని నిర్లక్ష్యం చేసింది.
మరొక ముఖ్య విషయం చైనా మహాకుడ్యాన్ని (great wall of China) పటిష్టంగా పునర్ నిర్మించడం.ఇప్పుడు యాత్రికులు బీజింగ్ దగ్గర చూసేది మింగ్ వంశం నాడు కట్టినదే అంటారు.
ఈ కాలంలో చైనా జనాభా 3 రెట్లు పెరిగిందని అంచనా.అంతవరకు 2వేల సం; నుంచి 5-10 కోట్ల మధ్య ఉండే జనాభా దాదాపు 30 కోట్లకు పెరిగింది.మింగ్ రాజధాని మధ్య చైనా లోని నాంజింగ్ నుండి ఉత్తర చైనా లోని బీజింగ్ కు మార్చబడింది.అక్కడే అనేక రాజభవనాలు ,రోడ్లు ,ఉద్యానవనాలు ,సరస్సులు ,ఆలయాలు నిర్మించారు.వాటినే ఇప్పుడు పర్యాటకులు దర్శిస్తూవుంటారు.
సాంస్కృతికంగా పెద్ద మార్పులేమె లేవు.కంఫుసియస్ నీతిశాస్త్ర పద్ధతుల్లోనే సమాజం ప్రవర్తిల్లుతుండేది.స్త్రీలు శీల వతులై ,భర్తలకు అనుకూలంగా విధేయులై ఇల్లు చక్క బెడుతూ ఉండాలి.సేవకులు యజమానుల ఆజ్ఞలను పాటించాలి.ప్రజలు రాజభక్తితో ఉండాలి.వ్యక్తి జీవితంలో నిజాయితీ, సత్యసంధత తో గౌరవమర్యాదలు పాటించాలి.
బౌద్ధమతాన్నికూడా ప్రజలు అనుసరించే వారు.బౌద్ధ ఆరామాలు చాల ఉండేవి.సన్యాసులు,శ్రమణకులు (monks) బొధలు చేస్తూ,తిరుగుతూ ఉండేవారు. గురుశిష్య సంబంధాలు మనలాగే ఉండేవి.
( మిగతా మరొకసారి.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి