12, జులై 2012, గురువారం

GEORGE BERNARD SHAW




 G.B.SHAW లేక జార్జ్ బెర్నార్డ్ షా ఇప్పుడెందరికి గుర్తున్నాడో తెలియదు కాని 20 వ శతాబ్దపు ప్రథమార్థ భాగంలో షేక్స్పియర్ తర్వాత అంత గొప్ప నాటక కర్తగా పేరొందాడు.ఐరిష్ జాతీయుడు.చిన్నతనంలోనే తల్లీ తండ్రీ వేరైపోయారు.ఎక్కువ  చదువుకోలేదు.స్కూలంటే ద్వేషం.తర్వాత ఒక గుమాస్తా పని చేసాడు కాని ఆ ఉద్యోగమన్నా ద్వేషమే.తరవాత జర్నలిస్ట్ గా పనిచేస్తూ రచనలు ప్రారంభించాడు.పెట్టుబడి దారీ వ్యవస్థ అంటే పడదు.సిడ్నీ ,బియాట్రిస్ ,వెబ్ అనే దంపతులతో కలిసి ఫేబియన్ సొసైటీ అనే సోషలిస్ట్ సంస్థ స్థాపించాడు. సహజంగా తెలివయిన వాడు కాబట్టి మంచి నాటకాలను రచించి,నాటక శాలలలో ప్రదర్శింప జేసే వాడు.క్రమంగా మంచిపేరు ,ధనమూ కూడా సంపాదించాడు.1925 లో ఆతనికి  నోబెల్ బహుమతి లభించింది.
  Ideology  లో షా సోషలిజానికి సానుభూతిపరుడు.ధనస్వామ్యానికి ,యుద్ధాలకీ  వ్యతిరేకి.ఐతే తీవ్రవాదాన్ని,హింసామార్గాన్ని వ్యతిరేకించాడు.
 బెర్నార్డ్ షా నాటకాల్లో ప్రసిద్ధమైన వాటిలో కొన్ని ఇస్తున్నాను.-
  1.Saint Joan 2.Androcles and the lion 3.Major Barbara 4.The devil's disciple 5.Candida 6.Arms and the man 7.Mrs.Warren's profession 8.Ceasar and Cleopatra 9.Back to Methusela 10.Pygmalion .ఈయన నాటకాలు చాలా రంగస్థలం మీదే కాక సినిమాలుగాను,టీ.వీ. షోలుగాను నిర్మించారు.పిగ్మాలియన్ హాలీవుడ్లో My fair lady @ అనే మ్యూజికల్ చిత్రంగా ప్రసిద్ధి పొందింది.మన భారతీయభాషా చిత్రాల్లో కూడా అనేక అవతారాలు ఎత్తింది.
  బెర్నర్డ్ షా జననం ;1856-మరణం; 1950 .94 సం.జీవించాడు.
 షా హాస్యప్రియుడు, చతుర భాషి.ఆయన  quotes , witticisms  చాలా ఉన్నాయి.మచ్చుకి ఒక్కటి మాత్రం ఉదహరిస్తాను.
  ఒక పార్టీలో సిన్మా నటి ఒకామె షాతో అందట ' మీరు నేను పెళ్ళి చేసుకుంటే   నా అందమూ,మీ తెలివితేటలూ ఉన్న పిల్లలు పుట్తారు కదా ' అని.(షా అందగాడు కాదు ) దానికి షా జవాబు; 'కాని ఒకవేళ నా అందమూ ,మీ తెలివి తేటలూ ఉన్న పిల్లలు పుట్టుతారేమో '        

11, జులై 2012, బుధవారం

film music




 భారతీయ  సినిమాలకి సంగీతం ముఖ్యపాత్ర వహిస్తుంది అన్న సంగతి తెలిసినదే.ఐతే ఏది మంచి పాట అంటే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చును.స్వర రాగ తాళ లయబద్ధమై శ్రావ్యమైన కంఠం తో గానం చేసిందే ఉత్తమ సంగీతం అంటారు.మన అభిరుచులు దాదాపు 12నుంచి పాతిక ( 25) ఏళ్ళ మధ్య స్థిరపడి పోతాయని అభిజ్ఞులు అంటారు.అందువలన ఆ వయసులో మనకు రుచించిన పాటలనే మనం మంచివనుకొంటాము.కాని విమర్శకులు చెప్పేదేమిటంటే వ్యక్తిగత అభిరుచులు మారినా ,ప్రతీ కళకీ కొన్ని ప్రామాణికాలు ఉంటాయని వాటిని బట్టే మనం నిర్దేశించాలని.వారి ప్రకారం నిష్పక్ష పాతంగా ,judge చేస్తే 1950=1970 మధ్యలో వచ్చిన సినిమా సంగీతమే అత్యుత్తమమైనదని,తెలుగు,హిందీ చిత్రసీమలు రెండిటిలోను ఆ యుగం period సంగీతానికి స్వర్ణయుగం అనవచ్చును .   

6, జులై 2012, శుక్రవారం

padyarachana

.


 ఈమధ్య అంతర్జాల సమస్య వలన రెండు శ్రీశంకరయ్యగారు ఇచ్చిన పద్యరచనలు చేసి కూడా నెట్లో ఉంచలేక పోయాను .వాటిని దిగువ రాస్తున్నాను.
  1.పద్యరచన35-28-6-12 ద్రౌపది వస్త్రాపహరణం చిత్రపటం గురించి-
      ఉచితానుచితముల నుపేక్షించి ధర్మజుడు
         స్వీయభార్యనె యొడ్డె సిగ్గుమాలి
      నిండు సభాస్థలి నెదుట జూచుచు నూర
          కుండిరి భీష్మాది కురుగురువులు
      దుష్టాత్ముడగు నీచ దుశ్శాసనుడు సాధ్వి
          వస్త్రమ్ము నపహరింపంగ జూసె
       ధర్మబద్ధత పాండుతనయులు వారింప
          కసహాయులట్టుల కదలకుండ్రి
            కృష్ణ భగవానుడే కాచె కృష్ణ నపుడు
            మహిళ స్థానమ్ము భరతసమాజమందు
            పురుషుల యహంకారమ్ము ,పరుషసరళి
            తెలుపు నీపటమ్మును జూడ గలుగు రోత .

    2 పద్యరచన 36
          ముసలి బిచ్చగాని ఫొతో ని చూసి  రాసినది.
        ''ఆరిపోయిన కుంపటీ'  యట్లు జవము
          సత్త్వములను గోల్పడి వృద్దజనుడొకండు
          వీధిలో బిచ్చమెత్తుచు వేచియుండె
          దానపరులెవరైన నుదారబుద్ధి
          ఆకలిని దీర్ప ధనమిత్తు రనుచు దలచి.
   
          అరువదేండ్ల స్వరాజ్యమ్ము నందు నేడు
           సైతమిట్టి స్థితిని గాంచ సిగ్గుచేటు
          సకలజనుల  శ్రేయో రాజ్య సాధనమ్ము
           ఇంక యెన్నాళ్ళు పట్టునో యేమొ కాని.
    మొదటి పద్యం మొదటి పాదం శ్రీ శ్రీ కి కృతజ్ఞతలతో
 
           
                          
   

26, జూన్ 2012, మంగళవారం

Rio-20 conference.



 ఈ మధ్య రియోడీజనీరో నగరంలో జరిగిన జీ-20 దేశాల శిఖరసమావేశం పెద్దగా ఏమీ సాధించకుండానే ముగిసింది.అందుకు కారణం అభివృద్ధి చెందిన అమెరికా,బ్రిటన్ ,వంటి అగ్రరాజ్యాలు ఆసక్తి చూపక పోవడమే.స్థూలంగా చెప్పాలంటే ; ఆ రాజ్యాలు బాగా  పారిశ్రామికీకరణం చేసుకొని,తమ బలం ,సంపదల వలన ప్రపంచంలో వనరులను వశపరచుకొన్నాయి.వాతావరణ కాలుష్యం,ఉద్గారాలు (toxic emissions ) ఆదేశాలే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.అవి తగ్గించుకోవడం  వాటికి ఇష్టం లేదు.కాని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను మాత్రం మీరు పరిశ్రమల కాలుష్యం,ఉద్గారాల్ని బాగా తగ్గించుకోమని సలహా ఇస్తాయి.అప్పటికీ మన ప్రధానమంత్రి గత దశాబ్దంలో ఈ దశగా తీసుకొన్న చర్యలను వివరించారు.మనము,చైనా, ఎక్కువగా తినడం వలన ఆహారపదార్థాల కొరత,వాటి ధరల పెరుగుదల కలుగుతున్నాయంటారు. అలాగే మన పరిశ్రమల పెరుగుదల వలన ప్రపంచం వేడెక్కుతున్నదని ,కాలుష్యం పెరుగుతున్నదని  వారి వాదన.కాని వాళ్ళ ప్రధాన బాధ్యత,భాగం పట్టించుకోరు.ఈ కారణాల వలన ఆ సమావేశం సఫలం కాలేదు.  

19, జూన్ 2012, మంగళవారం

INTACH.SEMINAR ON KALINGASEEMA




 17,18 జూన్ 2012న స్థానిక గాయత్రి కళాశాలలో  ,అధికారుల,దాతల సహాయంతో I.N.T.A.C.H.ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ తరఫున ఉత్తరాంధ్ర  సాంస్కృత ,వారసత్వ ,చారిత్రక సదస్సు జయప్రదంగా జరిగింది.రాష్ట్రం లోని వివిధ నగరాలనుంచి,ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన పరిశోధకులు,చరిత్ర ప్రొఫెసర్లు,పురావస్తు వేత్తలు(archeologists)ఉత్తరాంధ్ర ,కళింగ సీమ పై ముఖ్యంగా శ్రీ కాకుళం జిల్లాపై కేంద్రీకరించి వివిధ అంశాలపై పరిశోధనా పత్రాలు చదివి చర్చించారు.ఈ సదస్సును నిర్వహించిన వారినందరినీ అభినందిస్తూనే ,ఒక విషయం వ్రాయదలచుకొన్నాను.కార్యక్రమవివరాలు చివర దాకా ప్రజలకు తెలియజేయలేదు.సదస్సు గురించి పత్రికలు,టీ.వీ.లో ఏ ప్రచారమూ ముందుగా జరగలేదు.పేపర్లు,ఉపన్యాసకార్యక్రమాలు ఇంగ్లిష్ బదులు తెలుగులో జరిపించివుంటే  బాగుండేది. 

8, జూన్ 2012, శుక్రవారం

remakes



 ఈ మధ్య గుండమ్మకథ సినిమా రెమేక్ గురించి ఆలోచిస్తున్నారు.తెలుగులోనేకాక ,హిందీ,ఇంగ్లిష్ లో కూడా రెమేక్స్ వచ్చాయి.గతంలో ఆర్థికంగా బాగా విజయవంతమైనవి,లేక కళాత్మకమైనవని పేరు తెచ్చుకొన్నవి ఐన చిత్రాలను రీమేక్  చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.ఇందులో అనుకూలతలు 1.కథ,సంఘటనలు కొత్తగా వెతుక్కో నక్కర లేదు.beaten track .ఇంతకు ముందు విజయ వంతమైంది , లేక పేరు తెచ్చుకొంది కాబట్టీమళ్ళీ విజయవంతం అవుతుందని ఆశ,నమ్మకం.2.ప్రతికూలత - వద్దన్నా పాతచిత్రంతో పోలుస్తారు.దానిని మించకపోయినా కనీసం అందులో 75 శాతమైనా బాగు లేకపోయినా,నచ్చకపోయినా చిత్రం విజయవంతం కాదు. నాటికీ నేటికీ అభిరుచులూ,ఆలోచనలూ మారిపోవచ్చును.సరీఇన పాత్రధారులు దొరకక పోవచ్చును.ఇప్పుడు గుండమ్మకథకి సూర్యకాంతం పాత్ర లాగ.మొఘల్-ఇ-అజాం ,సికందర్,మదర్ ఇండియా రీమేక్లు అలోచనలోనే ఉండిపోయాయి.
  తెలుగులో 'పోతన ' ,వేమన ' ,త్యాగయ్య ' పల్నాటియుద్ధం,' బీదలపాట్లు  ' వీటి రీమేక్స్ ఒరిజినల్స్ అంత ప్రజాదరణ పొందలేదు.'రామదాసు ' ,శ్రీరామరాజ్యం , పరవా లేదనిపించుకున్నాయి.
 'మల్లీశ్వరి,'విప్రనారాయణ ' మళ్ళీ రంగుల్లో తీస్తే బాగుంటాయి.కాని,పాత్రధారులకన్నా,వాటిలోని,అద్భుతసంగీతాన్ని కొత్తరకంగా కంపోజ్ చెయ్యడం చాలా కష్టం.మంచి సంగీతం లేకుండా ఆ రెండు సినిమాలూ,రక్తి కట్టవు.'నర్తనశాలకి  'S.V.రంగారావు లాంటి కీచక 'పాత్రధారిని తేవడం  కష్టం.అందుకే ఇటీవల అమితాభ్ బచ్చన్ ' క్లాసిక్స్ ' మళ్ళీ నిర్మించకుండా ఉండడమే మంచిదని అన్నాడు.
 

5, జూన్ 2012, మంగళవారం




  అజ్ఞాతగారికి,నేను బాణామతి,తులసిదళం నవలలు రెండూ చదివాను.అవి popular thrillers కిందికి వస్తాయిగాని ఉత్తమనవలల కిందికి రావు.రచయిత భావాలతో మనం ఏకీభవించనక్కర లేదనుకోండి.కాని ,వస్తువు,శిల్పం రెండూ బాగుంటే మంచిది కదా.విశ్వనాథవారి నవలల్లో నేను ఉత్తమం గా పరిగణించేవి 1.వేయిపడగలు.2.చెలియలికట్ట.3.ఏకవీర. ofcourse  లోకో భిన్న రుచి .